ఫిలింసిటీలో కిడ్నాప్ కలకలం
* ‘లయన్’ సినిమా ప్రొడక్షన్ మేనేజర్, క్యాషియర్ అపహరణ
* దుండగులను పట్టుకున్న పోలీసులు
హయత్‌నగర్: రామోజీ ఫిలింసిటీలో కిడ్నాప్ కలకలం... లయన్ సినిమా షూటింగ్ స్పాట్‌నుంచి దుండుగులు ప్రొడక్షన్ మేనేజర్, క్యాషియర్‌ను ఎత్తుకెళ్లారు. పోలీసులు వెంబడించి వారిని పట్టుకున్నారు. బాధితులు, హయత్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం... ఫిలింసిటీలో బాలకృష్ణ నటిస్తున్న లయన్ షూటింగ్ జరుగుతోంది. సినిమా నిర్మిస్తున్న ఎస్ఎల్వీ కంపెనీ షూటింగ్ కోసం ఫనా ట్రావెల్స్‌కు చెందిన కార్లను అద్దెకు తీసుకుంది.
గత డిసెంబర్ 31న వీటిలో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో పాడైపోయాయి. ఆ కార్లకు మరమ్మతు చేయించాలని, కార్ల అద్దె కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫనా ట్రావెల్స్ నిర్వాహకులు జూబ్లీహిల్స్‌లోని ఎస్ఎల్వీ కార్యాలయానికి వెళ్లి గొడవ చేశారు. దీంతో కార్లకు మరమ్మతులు చేయించి అద్దె చెల్లిస్తామని ఎస్ఎల్వీ కంపెనీ వారు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం వేరే కంపెనీ కార్లను అద్దెకు తీసుకుని షూటింగ్ చేస్తున్నారు.
ఫనా ట్రావెల్స్‌కు చెందిన అక్బర్, ఇమ్రాన్‌ఖాన్, ఖాదర్ షరీఫ్, జీసంత్ఖాన్లతో పాటు మరో ఇద్దరు రామోజీ ఫిలింసిటీలో లయన్ సినిమా షూటింగ్ జరుగుతున్న చోటకు వచ్చారు. అక్కడే ఉన్న ప్రొడక్షన్ మేనేజర్ దిలీప్‌సింగ్, క్యాషియర్ రాఘవచంద్రలను బలవంతంగా కారు (ఏపీ09 సీసీ 1851)లో ఎక్కించుకుని నగరం వైపు బయలుదేరారు. అదే విధంగా మరో ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్ మహేష్‌ను కొట్టి అతని కారు పట్టుకెళ్లారు.
క్యాషియర్ రాఘవచంద్రను తీసుకెళ్తున్న కారు హయత్‌నగర్‌లోని తొర్రూరు క్రాస్‌రోడ్డు వద్ద ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో రాఘవచంద్ర కారు దిగి పారిపోగా.. దిలీప్‌సింగ్ లోపలే కూర్చున్నాడు. అదే సమయంలో మరో ట్రావెల్స్‌కు చెందిన కారు డ్రైవర్ మహేష్ దుండగులను కారులో వెంబడిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు, మహేష్ కలిసి వనస్థలిపురం పనామా వద్ద దుండగుల కారును అడ్డుకున్నారు. నిందితులను హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.