Lionel Messis
-
ఫిఫా ప్రపంచకప్: అర్జెంటీనాకు షాక్
నిజ్నీ నొవొగొరొడ్: ఫిఫా ప్రపంచకప్‌లో ఫేవరెట్ జట్లలో ఒకటైన అర్జెంటీనాకు షాక్ తగిలింది. గ్రూప్ డిలో భాగంగా క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా చిత్తుగా ఓడిపోయింది. క్రొయేషియాకు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన మెస్సీ అండ్ గ్యాంగ్ 0-3తో ఓటమి పాలైంది. క్రొయేషియా పోటీ పడి గోల్స్ చేయగా మెస్సీ సేన ఒక్క గోల్ కూడా నమోదు చేయలేక చతికిలబడింది. ప్రధానంగా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ ఈ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ ఓటమితో అర్జెంటీనా నాకౌట్ ఆశలు సంక్లిష్టం చేసుకుంది. ఇరు జట్లు ప్రథమార్థంలో గోల్స్ చేయడంలో విఫలమైతే, ద్వితీయార్థం ప్రారంభమైన ఎనిమిది నిమిషాలకే అంటీ రెబిక్ క్రొయేషియాకు తొలి గోల్‌ను అందించాడు. అనంతరం అర్జెంటీనా-క్రొయేషియాలు గోల్ కోసం తీవ్రంగా శ్రమించాయి. కాగా, ఆట 80వ నిమిషంలో క్రొయెషియా ఆటగాడు బ్రొజోవిక్ అందించిన సహకారంతో లుకా మాడ్రిక్ అద్భుత గోల్ అందించాడు. దీంతో 2-0తో ఆధిక్యంలోకి వచ్చిన క్రొయేషియా ప్రత్యర్థి అర్జెంటీనాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అర్జెంటీనా ఆటగాళ్లు పదేపదే గోల్ పోస్ట్‌పై దాడి చేసినా క్రొయేషియా రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయారు. ఎక్సట్రా ఇంజూరి టైమ్ (90+1)లో ఇవాన్ రాకిటిక్ క్రొయేషియాకు మూడో గోల్ అందించాడు. ఇక ఆట ముగిసేసరికి మరో గోల్ నమోదు కాకపోవడంతో క్రొయేషియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అరెంటీనా 14 అనవసర తప్పిదాలు చేయగా, క్రొయేషియా 19 తప్పిదాలు చేసింది. అర్జెంటీనా గోల్ పోస్ట్‌పై ఏడు సార్లు దాడి చేయగా, క్రొయేషియా తొమ్మిది సార్లు దాడి చేసింది. ఈ మ్యాచ్‌లో నలుగురు క్రొయేషియా ఆటగాళ్లకు, ముగ్గురు అర్జెంటీనా ఆటగాళ్లుకు రిఫరీలు ఎల్లో కార్డు చూపించారు. రికార్డులు.. ప్రపంచకప్‌లో క్రొయేషియా చేతిలో 1998లో ఏకైకసారి ఆడి ఓడిపోయిన అర్జెంటీనాకు ఈసారి ఏదీ కలిసిరాలేదు. తొలి మ్యాచ్‌లో 1-1తో ఐస్‌లాండ్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న అర్జెంటీనా.. సాకర్ ప్రపంచకప్‌లో లీగ్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లు గెలవకపోవటం 44 సంవత్సరాల తర్వాత ఇదే కావడం విశేషం. ఫుట్‌బాల్ సంగ్రామంలో ఓటమి పరంగా 1958లో ఛెకోస్లోవేకియాపై 1-6 తేడాతో ఓటమి తర్వాత రెండో అతి పెద్ద ఓటమి కావడం గమనార్హం. ఇక నాకౌట్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే జూన్26న నైజీరియాతో జరిగే మ్యాచ్‌లో అర్జెంటీనా తప్పక గెలవాల్సిన పరిస్థితి. -
అర్జెంటీనాను గెలిపించిన మెస్సీ
కిటో (ఈక్వెడార్): వచ్చే ఏడాది రష్యాలో జరిగే ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా అదరగొట్టింది. స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ అన్నీ తానై ‘హ్యాట్రిక్’ సాధించి అర్జెంటీనాను ఒంటిచేత్తో గెలిపించా డు. ఈక్వెడార్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 3–1తో విజయం సాధించి ప్రపంచకప్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మ్యాచ్ మొదలైన 38 సెకన్లకే ఇబర్రా చేసిన గోల్‌తో ఈక్వెడార్ ఖాతా తెరిచింది. అయితే మెస్సీ తన మ్యాజిక్‌తో 11వ నిమిషంలో గోల్ చేసి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత 18వ, 62వ నిమిషంలో మెస్సీ మరో రెండు గోల్స్ చేసి హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. అర్జెంటీనాకు ప్రపంచకప్ బెర్త్‌ను అందించాడు. అర్జెంటీనాతోపాటు కొలంబి యా, ఉరుగ్వే, పనామా జట్లు... యూరోప్ జోన్ నుంచి పోర్చుగల్, ఫ్రాన్స్ జట్లు ప్రపంచకప్‌కు అర్హత పొందాయి. నెదర్లాండ్స్, చిలీ, పరాగ్వే, అమెరికా జట్లు విఫలమయ్యాయి. -
మెస్సీ కుటుంబంపై చిలీ అభిమానుల దాడి
శాండియాగో: అభిమానం అదుపుతప్పింది. క్రీడాస్ఫూర్తి మంటకలిసింది. ఇరు జట్ల అభిమానులు పరస్పరం దూషించుకున్నారు. అంతటితో ఆగకుండా ఆటగాళ్లకు చెందిన కుటుంబసభ్యులపై దాడులకు తెగబడ్డారు. ఇదీ.. కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్స్ మ్యాచ్ సందర్భంగా శాండియాగోలోని ఎస్టాడియో నేషనల్ స్టేడియంలో చోటుచేసుకున్న పరిస్థితి. మ్యాచ్ ప్రారంభం నుంచి ఇరుజట్లూ అద్భుతంగా ఆడటంతో ఒక్క గోల్ కూడా నమోదుకాలేదు. చివరికి షూట్ అవుట్ ద్వారా ఆతిథ్య చిలీ జట్టు 4-1 తేడాతో విజేతగా నిలిచిందిది. కాగా, ఫస్ట్‌హాఫ్ విరామంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ కుటుంబసభ్యులను ఉద్దేశించి కొందరు చిలీ అభిమానులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కోపోద్రిక్తుడైన మెస్సీ సోదరుడు రొడ్రిగో ఘాటుగా ప్రతిస్పందించాడు. దీంతో ఇరు బృందాల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. ఒక దశలో మెస్సీ కుటుంబసభ్యులను చిలీ అభిమానులు తోసివేసినట్లు సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు మెస్సీ సోదరుణ్ని టీవీ క్యాబిన్‌కు తరలించారు. మిగతా మ్యాచ్ ను అక్కడినుంచే వీక్షించాలని, గ్యాలరీలోకి వెళ్లొద్దని రొడ్రిగోను పోలీసులు అభ్యర్థించారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని తెలిసింది.