సోమవారం నాటి రెండు మ్యాచ్‌లూ రద్దు
అహ్మదాబాద్: చాంపియన్స్ లీగ్ టి20లో భాగంగా సోమవారం జరగాల్సిన మ్యాచ్‌ల విషయంలో అభిమానులు తీవ్ర నిరుత్సాహం చెందారు. స్థానికంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో మ్యాచ్‌లను ఆడించేందుకు వీలు కాలేదు. ముందుగా గ్రూప్ ‘ఎ’ లోని పెర్త్ స్కార్చర్స్, హైవెల్డ్ లయన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఇదే కారణంగా రద్దయ్యింది.
ఏకధాటిగా కురిసిన వర్షానికి స్థానిక సర్దార్ పటేల్ స్టేడియం చెరువును తలపించింది. మ్యాచ్‌లో ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో ఇరు జట్లకు రెండేసి పాయింట్లు లభించాయి. అంతకుముందు టాస్ నెగ్గిన లయన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఆ వెంటనే భారీ స్థాయిలో వర్షం కురవడం ప్రారంభమైంది. గంటన్నర సమయం వరకు వేచి చూసినా ఎంతకీ తగ్గక పోవడంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ లీగ్‌లో ఈ రెండు జట్లకు ఇదే తొలి మ్యాచ్.
ముంబై, ఒటాగో మ్యాచ్ కూడా...
గ్రూప్ ‘ఎ’లో భాగంగా రాత్రి ఎనిమిది గంటలకు ముంబై ఇండియన్స్, ఒటాగో వోల్ట్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షార్పణం అయ్యింది. నిరంతరాయంగా కురిసిన వర్షానికి నిర్వాహకులు చేతులెత్తేశారు. టాస్ సమయం 7.30 గంటల వరకు వేచి చూశారు. సాయంత్రం లాగా భారీ వర్షం కురవక పోయినా అంపైర్లు మాత్రం టాస్ వేయించకుండా మ్యాచ్ రద్దుకే మొగ్గు చూపారు. దీంతో ఇరు జట్లకు రెండేసి పాయింట్లు ఇచ్చారు. దీంతో ఇప్పటికే రాజస్థాన్ చేతిలో ఓడిన ముంబై జట్టుకి సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారాయి.