రిస్క్ తక్కువ.. వడ్డీ ఎక్కువ
ఉమెన్ ఫైనాన్స్ / లిక్విడ్ బీస్
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే మదుపుదారులు పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆ పెట్టుబడి సొమ్మును బ్యాంకు ఖాతాలో గాని లేదా స్టాక్ బ్రోకర్ వద్ద మార్జిన్ ఖాతాలో గాని ఉంచుతూ ఉండి, ఎప్పుడైతే వారికి వారు అనుకున్నటువంటి షేర్లో మంచి అవకాశం వస్తుందో అప్పుడు ఆ సొమ్ముతో కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసేంత వరకు ఆ సొమ్మును బ్యాంకులోనైతే చాలా తక్కువ వడ్డీ వస్తుంది, మార్జిన్ ఖాతాలోనైతే ఏమీ రాదు. ఇలాంటి వారికి కొనుగోలు చేసేంత వరకూ కూడా రాబడి పొందే మార్గమే ‘లిక్విడ్ బీస్’.
ఈ లిక్విడ్ బీస్ను గోల్డ్‌మాన్ సాచ్స్ అసెట్ మేనేజ్మెంట్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుంటుంది. ఇది ఓపెన్ ఎండెడ్ స్కీమ్. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి లిక్విడ్ ఇటిఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రీటెడ్ ఫండ్). ఒక షేర్ ఎలాగైతే ఎక్సేజ్లో లిస్ట్ అయ్యి ట్రేడ్ జరుగుతుందో అదే మాదిరిగా ఈ లిక్విడ్ బీస్ కూడా ఎన్ఎస్ఇ, బిఎస్ఇలలో లిస్ట్ అయ్యి ట్రేడ్ జరుగుతుంది.
తక్కువ రిస్క్ కలిగి ఉండి. బ్యాంకు వడ్డీకన్నా ఎక్కువ రాబడిని ఇస్తూ ఎప్పుడు కావాలంటే అప్పుడు సొమ్మును వెనక్కి తీసుకునే సదుపాయాన్ని కల్పించడమే ఈ స్కీం ముఖ్య ఉద్దేశం.
* ఇందులో పెట్టుబడి పెట్టిన సొమ్మును కాల్‌మనీ మార్కెట్, స్వల్పకాలిక గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్ తదితర స్వల్పకాలిక మార్గాలలో ఫండ్ మేనేజర్స్ పెట్టుబడి పెడుతూ ఉంటారు.
* లిక్విడ్ బీస్ ఒక్కొక్క యూనిట్ ధర 1000 రూపాయలుగా ఉంటుంది. ఎక్సేంజ్‌లో ఒక యూనిట్‌ని మొదలుకొని ఎన్నైనా కొనుగోలు చేయవచ్చు.
* ఈ స్కీమ్ డైలీ డివిడెండ్, డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. అంటే డైలీ వచ్చే డివిడెండ్‌ని నగదు రూపేణా కాకుండా ఆ సొమ్ముతో యూనిట్స్‌ని అందజేస్తారు.
* ప్రతి 30 రోజులకొకసారి ఈ డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ యూనిట్స్‌ని పెట్టుబడిదారుని డీ-మాట్ ఖాతాకు జమచేస్తారు. ఈ యూనిట్స్‌ని 3 డెసిమల్స్ వరకూ అలాట్ చేస్తారు.
* సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ చార్జీలు ఈ లిక్విడ్ బీస్కి వర్తించవు.
* షేర్లు అమ్మినరోజే ఈ లిక్విడ్ బీస్‌ని కొనవచ్చు. అలాగే ఎప్పుడైతే మరలా షేర్లు కొనుగోలు చేయదలచుకున్నారో ఆరోజు లిక్విడ్ బీస్‌ని అమ్మేసి షేర్లు కొనవచ్చు.
* ఈ లిక్విడ్ బీస్‌ని ఈక్విటీ డెరివేటివ్స్‌కి 10 శాతం హైర్ కట్‌తో మార్జిన్ లాగా కూడా వాడుకోవచ్చు.
* వీటిని ఎక్స్ఛేంజ్లో కాకుండా ఫండ్ వద్ద నేరుగా కొనాలి. అంటే ముందుగా మినిమమ్ 2,500 రూపాయల యూనిట్స్ కొనాలి. అదే ఎక్స్సేంజీలో అయితే ఒక యూనిట్ కొనుగోలు చేయవచ్చు.
* తప్పనిసరిగా డీ-మాట్ కలిగి ఉండాలి.
* యూనిట్స్‌ని అమ్మదలచుకొన్నప్పుడు ఎక్సేంజ్కైతే ఒక యూనిట్ మొదలుకొని ఎన్నెన్నో అమ్మవచ్చు. కాని డెసిమల్ యూనిట్స్‌ని అనుమతించరు. ఈ డెసిమల్ యూనిట్స్‌ని డెరైక్ట్‌గా ఫండ్‌కి రెడీమ్ పంపి సొమ్ము తీసుకోవచ్చు.
* ఈ లిక్విడ్ బీస్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు మీకు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ చార్జీ పడదు. కానీ ఇతర చార్జీలైనటువంటి బ్రోకరేజీ, సర్వీసుటాక్స్, స్టాంప్ డ్యూటీ తదితరాలు వర్తిస్తాయి కనుక వాటిని కూడా ఒకసారి గమనించి పెట్టుబడి పెట్టడం మంచిది. లేదంటే వచ్చిన రాబడి ఖర్చులకే సరిపోతుంది.
- రజని భీమవరపు
ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’