పళనిస్వామి ఐదు సంతకాలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎడప్పాడి పళనిస్వామి పరిపాలనలో తన ముద్ర వేసేందుకు శ్రీకారం చుట్టారు. అనూహ్యంగా సీఎం పదవిలోకి వచ్చి ఉద్రిక్త పరిస్థితుల నడుమ అసెంబ్లీలో బలం నిరూపించుకున్న ఆయన పాలనపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటికి సంబంధించిన ఫైళ్లపై సోమవారం ఆయన సంతకాలు చేశారు.
'అమ్మ' ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఆమె బాటలోనే తాను పయనిస్తున్నానని పళనిస్వామి చెప్పారు. ఐదు ఫైళ్లపై సంతకాలు చేసినట్టు తెలిపారు. కరువు ప్రాంత రైతుల కోసం నిధులు విడుదల చేసినట్టు వెల్లడించారు. త్వరలోనే ప్రజలందరికీ పరిశుద్ధ తాగునీరు పంపిణీ చేస్తామన్నారు.
సీఎం సంతకాలు చేసిన ఫైళ్లు..
1. నిరుద్యోగులకు భృతి రెట్టింపు
2. ప్రసూతి సాయం రూ. 12 వేల నుంచి రూ. 18 వేలకు పెంపు
3. ఉద్యోగాలు చేసే లక్ష మంది మహిళలకు 50 శాతం సబ్సిడీపై ద్విచక్ర వాహనాలు
4. రూ. 85 కోట్లతో మత్స్యకారులకు 5 వేల గృహాల నిర్మాణం
5. మరో 500 ప్రభుత్వ మద్యం దుకాణాల మూసివేత