ప్రచారం.. సమాప్తం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో 28 లోక్సభ స్థానాలకు జరుగనున్న ఎన్నికలకు మంగళవారం సాయంత్రం ప్రచారం ముగిసింది. గురువారం పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే.
ఆఖరు రోజు అభ్యర్థులందరూ ప్రచారంలో తలమునకలయ్యారు. భారీ సంఖ్యలో కార్యకర్తలతో ఊరేగింపులు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. బహిరంగ ప్రచారానికి తెర పడడంతో అభ్యర్థులు చాటు మాటు వ్యవహారాలకు సిద్ధమయ్యారు. ఓటర్లను ఆకర్షించడానికి ఆఖరు ‘అస్త్రాల’ను ప్రయోగిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి తాయిలాలు అందిస్తున్నారు.
మద్యం దుకాణాల మూత
ఎన్నికల ప్రచారం సాయంత్రం ఆరు గంటలకు ముగిసిందని రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారి అనిల్ కుమార్ ఝా తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గురువారం వరకు మద్యం విక్రయాలు, రవాణాను నిషేధించినట్లు వెల్లడించారు. టీవీలలో ఎన్నికలపై విశ్లేషణలు లాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని మీడియాను కోరారు. ఓటర్లపై ప్రభావం చూపే ఎలాంటి కార్యక్రమాలు చూపవద్దని సూచించారు.
కాగా ఇప్పటికే పలు పోలింగ్లలో కొందరు ఓట్లు వేసినందున, ఈసారి పోలింగ్ కేంద్రంలో ఓటరుకు ఎడమ చేతి బొటన వేలిపై సిరా గుర్తు పెడతారని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ2.7.95 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రూ.2.8 కోట్ల విలువైన 44,924 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. రాష్ర్టమంతటా 1,559 ఎన్నికల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు.
బందోబస్తుకు పోలీసులు
ఎన్నికల బందోబస్తుకు మంగళవారం మధ్యాహ్నం నుంచే పోలీసులు నిర్దేశిత నియోజక వర్గాలకు వెళ్లారు. రాష్ర్టం మొత్తం మీద 54,264 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో 14,960 కేంద్రాలను సమస్యాత్మక, 11,424 కేంద్రాలను అతి సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఎన్నికల విధులకు మొత్తం 3.80 లక్షల మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 2.95 లక్షల మంది పోలింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తారు. 85 వేల మందిని భద్రత కోసం నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 284 పోలీసు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
ఆర్టీసీ వినతి
ఎన్నికల విధుల కోసం బుధ, గురువారాల్లో వేల బస్సులను తరలించనున్నందున, ప్రయాణికులు ఈ రెండు రోజులు సహకరించాలని ఆర్టీసీ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.