liquor stores license
-
మద్యం షాపుల లైసెన్సు రెన్యువల్
సాక్షి, అమరావతి: ఈ నెలాఖరుతో మద్యం పాలసీ ముగుస్తున్నందున ప్రస్తుతమున్న 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలకు ఏడాది పాటు లైసెన్సు రెన్యువల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో మద్యపానంతో కలిగే దుష్పరిణామాలపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ శుక్రవారం జీవో జారీ చేశారు. గతేడాది అక్టోబర్ 1న ప్రకటించిన పాలసీలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే రిటైల్ మద్యం దుకాణాలను నిర్వహించేలా ఏడాదికి లైసెన్సు జారీ చేశారు. అప్పట్లో ఉన్న 4,380 షాపులను 33 శాతం తగ్గించడంతో ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో 2,934 షాపులు నడుస్తున్నాయి. వీటికి వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలాఖరు వరకు లైసెన్సులను జారీ చేస్తారు. ► 2,934 షాపులను మాత్రమే నిర్వహించాలి. ఈ సంఖ్య పెరగకుండా వాక్ ఇన్ షాపులు (ఎలైట్ షాపులు) ఏర్పాటుకు అనుమతించింది. ► జాతీయ రహదారుల వెంబడి మద్యం అమ్మకాలపై సుప్రీంకోర్టు నిబంధనలు గట్టిగా అమలుపరచాలి. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు, వయా ఆర్టీసీ బస్టాండ్, లీలామహల్ సర్కిల్, నంది సర్కిల్, విష్ణు నివాసం, శ్రీనివాసం, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్వీఆర్ఆర్ ఆస్పత్రి, స్విమ్స్ ఆస్పత్రి వరకు మద్యం షాపులకు అనుమతి లేదు. ► ఏపీఎస్‌బీసీఎల్ ఆధ్వర్యంలో ఈ మద్యం షాపులు నడుస్తాయి. మద్యం షాపుల్లో ట్రాక్ అండ్ ట్రేస్ విధానం అమలయ్యేలా చూడాలి. దీనివల్ల అవకతవకలు జరగడానికి అవకాశం ఉండదు. -
చిన్న వెంకన్న చెంత.. ఇదేమి చింత
ద్వారకాతిరుమల: రాష్ట్ర ప్రభుత్వం మద్యం విక్రయాలకు ఇష్టారాజ్యంగా లైసెన్సులు ఇవ్వడంతో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోను మద్యం ఏరులై పారుతోంది. దీంతో భక్తుల మనోభవాలు దెబ్బతింటున్నాయి. జిల్లాలోని ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో ఈ దుస్థితి మరింత ఎక్కువగా ఉంది. గతంలో చిన్నతిరుపతి క్షేత్రానికి వచ్చే భక్తులకు గరుడాళ్వార్ విగ్రహం స్వాగతం పలికేది. ఇప్పుడు మద్యం దుకాణాలు, వాటి బోర్డులే ఆహ్వానం పలుకుతున్నాయి. క్షేత్రంలోని దేవస్థానం ఆర్చిగేట్లు, స్వామివారి మండపాలు, దేవతామూర్తుల విగ్రహాలకు కూతవేటు దూరంలోనే మద్యం దుకాణాలు ఉండటంపై స్థానికులు, భక్తులు మండిపడుతున్నారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ చట్టంలోని నియమ నిబంధనలను పాలకులు, అధికారులు తుంగలోకి తొక్కి మరీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నిబంధనలను అమలు చేస్తున్నారు. క్షేత్రంలో గుడికి, బడికి వంద మీటర్ల దూరంలోనే మద్యం దుకాణాలు ఉన్నాయంటున్న వ్యాపారులు విక్రయాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ చట్టం ప్రకారం ఇది తప్పని అడిగేవారు లేకపోవడంతో ప్రముఖ క్షేత్రాల్లో మద్యం దుకాణాలకు ప్రభుత్వం ఇష్టానుసారం లైసెన్సులను ఇస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లైసెన్సుల్ని రద్దు చేయాలి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ చట్టం సెక్షన్ 2 లోని సబ్ సెక్షన్ 27 ప్రకారం దేవతామూర్తుల కైంకర్యాలకు వినియోగించే తెప్పోత్సవ మండపాలు సైతం గుడిలో భాగమే. అంతేకాదు మతపరమైన ఆరాధనా స్థలాలు, మందిరాలు, పుణ్యక్షేత్రాలు, ఉప పుణ్యక్షేత్రాలు ఇలా అన్నింటి సమూహమే ఆలయమని చట్టం చెబుతోంది. దీని ప్రకారం శ్రీవారి క్షేత్రంలో శివ మండపం, విలాస మండపం, ఆర్చిగేట్లు, దేవతామూర్తుల విగ్రహాలకు సమీపంలో మద్యం దుకాణాలు ఉండకూడదు. అవి క్షేత్రంలో అమలవడం లేదు. అధికారులు పట్టించుకోకపోవడం వల్లే క్షేత్రాల్లో పవిత్రత దెబ్బతింటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తులే టార్గెట్ మద్యం వ్యాపారులు భక్తులనే లక్ష్యంగా చేసుకుని క్షేత్రాల్లో మద్యం విక్రయాల్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు. వివాహాది శుభకార్యాలు జరిగే సమయాల్లో అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ద్వారకాతిరుమలలో మద్యం వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. క్వార్టర్ బాటిల్‌పై ఎమ్మార్పీ ధర కంటే అదనంగా రూ. 10లు వ్యాపారులు వసూలు చేస్తున్నారు. మందుబాబులు మాత్రం మద్యం దొరికితే చాలన్నట్లు కొనుగోలు చేస్తున్నారు. నిత్యం క్షేత్రంలో లక్షలాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. ప్రముఖ క్షేత్రాల్లో అడ్డుకట్ట వేయాలి ఇప్పటికైనా రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు స్పందించి, ప్రముఖ క్షేత్రాల్లో మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేసి, క్షేత్రాల పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. హిందూ మత పరిరక్షకులు క్షేత్రాల్లో మద్యం విక్రయాలను ఎందుకు అడ్డుకోవడం లేదని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. చినవెంకన్నను దర్శించేందుకు క్షేత్రానికి వచ్చి, తాగి పడిపోతున్న భక్తుల వల్ల, యాత్రికుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అంటున్నారు. చిన్న తిరుపతిలో మాడ వీధులు లేకపోవడం వల్ల స్వామివారి వాహనాలు క్షేత్ర పురవీధుల్లో తిరగాల్సి వస్తోంది. దీంతో క్షేత్రంలో ఉన్న మద్యం దుకాణాల మీదుగా శ్రీవారి వాహనాలు తిరుగుతున్నాయి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి రాష్ట్రంలోని ప్రధాన క్షేత్రాల్లో మద్యం విక్రయాలకు చెక్ పెట్టాలని భక్తులు కోరుతున్నారు. -
సర్కారీ...చౌక మద్యం!
♦ చీప్ లిక్కర్ధర తగ్గించి అమ్మేందుకు సన్నాహాలు ♦ కొత్త పాలసీ రూపకల్పనలో భాగంగా ముందస్తు ప్రయోగం ♦ మూడు మాసాలు పొడిగించనున్న మద్యం దుకాణాల లెసైన్స్ ♦ సెప్టెంబర్ నెలాఖరు వరకు పాత పాలసీ విధానం అమలు సారా మహమ్మారి నుంచి మద్యం ప్రియులను రక్షించేందుకు ప్రభుత్వం నడుంబిగిస్తోంది..పేదల ఇళ్లలో విషాదాన్ని నింపుతున్న గుడుంబాను తరిమికొట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే చౌక మద్యాన్ని ప్రవేశపెట్టాలని యోచి స్తోంది. కొత్త మద్యం పాలసీని సమగ్రంగా రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసి, పాత లెసైన్స్‌ల గడవును మరో మూడు మాసాలు పొడిగించింది. -నల్లగొండ జిల్లాలో పేద, మధ్య తరగతి ప్రజలే సారాకు బానిసలుగా మారుతున్నారు. మూడు పదుల వయసులోనే యువకులు గుడుంబాకు బానిసలై మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి వారి కోసమే గుడుంబా అమ్మకాలను అరికట్టాలంటే దాని స్థానంలో చీప్ లిక్కర్‌ను చౌక ధరకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో చీప్ లిక్కర్ క్వార్టర్ ఎమ్మార్పీ ధర రూ.60లు ఉంది. అయితే రాబోయే కొత్త పాలసీలో చీప్ లిక్కర్ క్వార్టర్ ధర రూ.30లకే విక్రయించాలనే ప్రతిపాదన ఉంది. దీంతో పాటు పాలసీలో నాలుగైదు కొత్త అంశాలను కూడా చేర్చడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఎక్సైజ్ శాఖ రూపొందించిన కొత్త పాలసీ విధానాల పై సంతృప్తి చెందని సీఎం కేసీఆర్ గుడుంబాను నిర్మూలించేందుకు పకడ్బందీ ప్రణాళికను తయారు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో జిల్లా ఎక్సైజ్ శాఖ నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు.దీనిలో భాగంగానే లెసైన్స్ గడువును పొడిగించడంతో పాటు, ఈ మూడు మాసాల కాలంలో చీప్ లిక్కర్ ధర తగ్గించి అమ్మకాలు చేయాలనే ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. ధర తగ్గించి అమ్మడం వల్ల గుడుంబా అమ్మకాలకు అడ్డుకట్టవేయోచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ విధానాన్ని మూడు మాసాల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయో అంచనా వేసి దాని ప్రకారంగా కొత్త పాలసీ రూపొం దించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. పాత నిబంధనలే కొనసాగింపు... ఇప్పుడున్న మద్యం పాలసీనే మూడు నెలల వరకు అంటే సెప్టెంబర్ నెలాఖరు వరకు కొన సాగించాలని నిర్ణయించారు. పాత పాలసీలో ఉన్న విధానాలనే మూడు నెలల పాటు అమలు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు పట్టణాల్లో మద్యం దుకాణాల లెసైన్స్ ఫీజు రూ .42 లక్షలు ఉంది. దీనిని మూడు స్లాబుల్లో వసూలు చేస్తున్నారు. లెసైన్స్ ఫీజుకు సరిపడా ఏడు రెట్ల మద్యాన్ని 20 శాతం మార్జిన్‌తో ఇస్తున్నారు. ఏడు రెట్లు స్టాకు పూర్తయిన తర్వాత 13.65 శాతాన్ని అడిషనల్ ప్రివిలైజ్ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వం మినహాయిస్తుంది. ఇదే విధానాన్ని ఈ మూడు నెలలకు విభజించి అమలు చేయడం జరుగుతుంది. అదెలాగంటే రూ.42 లక్షల లెసైన్స్ ఫీజు మూడు మాసాలకు లెక్కించినట్లయితే రూ.10.50 లక్షలు అవుతుంది. దానికి ఏడు రెట్లు అంటే రూ.73.50 లక్షల మద్యాన్ని లెసైన్స్‌దారులకు ఇస్తారు. ఈ ఏడు రెట్ల మద్యం అమ్మకాలు దాటినట్లయితే అప్పుడు 13.65 శాతం ప్రివిలైజ్ టాక్స్ ప్రభు త్వ ఖజానాల్లోకి వెళ్తుంది. మద్యం దుకాణాల్లో పర్మిట్ రూమ్ లెసైన్స్ ఫీజు రూ.2 లక్షలు కాకుండా మూడు మాసాలకు మాత్రమే వసూలు చేస్తారు. ఈ నెలాఖరు నాటికి వ్యాపారులు ముందుకు వచ్చి లెసైన్స్ రెన్యువల్ చేసుకుంటే అట్టి దుకాణాలకు కొత్తగా టెండర్లు పిలుస్తారు.