♦ చీప్ లిక్కర్‌ధర తగ్గించి అమ్మేందుకు సన్నాహాలు
♦ కొత్త పాలసీ రూపకల్పనలో భాగంగా ముందస్తు ప్రయోగం
♦ మూడు మాసాలు పొడిగించనున్న మద్యం దుకాణాల లెసైన్స్
♦ సెప్టెంబర్ నెలాఖరు వరకు పాత పాలసీ విధానం అమలు
సారా మహమ్మారి నుంచి మద్యం ప్రియులను రక్షించేందుకు ప్రభుత్వం నడుంబిగిస్తోంది..పేదల ఇళ్లలో విషాదాన్ని నింపుతున్న గుడుంబాను తరిమికొట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే చౌక మద్యాన్ని ప్రవేశపెట్టాలని యోచి స్తోంది. కొత్త మద్యం పాలసీని సమగ్రంగా రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసి, పాత లెసైన్స్‌ల గడవును మరో మూడు మాసాలు పొడిగించింది.
-నల్లగొండ
జిల్లాలో పేద, మధ్య తరగతి ప్రజలే సారాకు బానిసలుగా మారుతున్నారు. మూడు పదుల వయసులోనే యువకులు గుడుంబాకు బానిసలై మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి వారి కోసమే గుడుంబా అమ్మకాలను అరికట్టాలంటే దాని స్థానంలో చీప్ లిక్కర్‌ను చౌక ధరకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో చీప్ లిక్కర్ క్వార్టర్ ఎమ్మార్పీ ధర రూ.60లు ఉంది. అయితే రాబోయే కొత్త పాలసీలో చీప్ లిక్కర్ క్వార్టర్ ధర రూ.30లకే విక్రయించాలనే ప్రతిపాదన ఉంది. దీంతో పాటు పాలసీలో నాలుగైదు కొత్త అంశాలను కూడా చేర్చడం జరిగింది.
రాష్ట్ర స్థాయిలో ఎక్సైజ్ శాఖ రూపొందించిన కొత్త పాలసీ విధానాల పై సంతృప్తి చెందని సీఎం కేసీఆర్ గుడుంబాను నిర్మూలించేందుకు పకడ్బందీ ప్రణాళికను తయారు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో జిల్లా ఎక్సైజ్ శాఖ నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు.దీనిలో భాగంగానే లెసైన్స్ గడువును పొడిగించడంతో పాటు, ఈ మూడు మాసాల కాలంలో చీప్ లిక్కర్ ధర తగ్గించి అమ్మకాలు చేయాలనే ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. ధర తగ్గించి అమ్మడం వల్ల గుడుంబా అమ్మకాలకు అడ్డుకట్టవేయోచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ విధానాన్ని మూడు మాసాల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయో అంచనా వేసి దాని ప్రకారంగా కొత్త పాలసీ రూపొం దించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.
పాత నిబంధనలే కొనసాగింపు...
ఇప్పుడున్న మద్యం పాలసీనే మూడు నెలల వరకు అంటే సెప్టెంబర్ నెలాఖరు వరకు కొన సాగించాలని నిర్ణయించారు. పాత పాలసీలో ఉన్న విధానాలనే మూడు నెలల పాటు అమలు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు పట్టణాల్లో మద్యం దుకాణాల లెసైన్స్ ఫీజు రూ .42 లక్షలు ఉంది. దీనిని మూడు స్లాబుల్లో వసూలు చేస్తున్నారు. లెసైన్స్ ఫీజుకు సరిపడా ఏడు రెట్ల మద్యాన్ని 20 శాతం మార్జిన్‌తో ఇస్తున్నారు. ఏడు రెట్లు స్టాకు పూర్తయిన తర్వాత 13.65 శాతాన్ని అడిషనల్ ప్రివిలైజ్ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వం మినహాయిస్తుంది.
ఇదే విధానాన్ని ఈ మూడు నెలలకు విభజించి అమలు చేయడం జరుగుతుంది. అదెలాగంటే రూ.42 లక్షల లెసైన్స్ ఫీజు మూడు మాసాలకు లెక్కించినట్లయితే రూ.10.50 లక్షలు అవుతుంది. దానికి ఏడు రెట్లు అంటే రూ.73.50 లక్షల మద్యాన్ని లెసైన్స్‌దారులకు ఇస్తారు. ఈ ఏడు రెట్ల మద్యం అమ్మకాలు దాటినట్లయితే అప్పుడు 13.65 శాతం ప్రివిలైజ్ టాక్స్ ప్రభు త్వ ఖజానాల్లోకి వెళ్తుంది. మద్యం దుకాణాల్లో పర్మిట్ రూమ్ లెసైన్స్ ఫీజు రూ.2 లక్షలు కాకుండా మూడు మాసాలకు మాత్రమే వసూలు చేస్తారు. ఈ నెలాఖరు నాటికి వ్యాపారులు ముందుకు వచ్చి లెసైన్స్ రెన్యువల్ చేసుకుంటే అట్టి దుకాణాలకు కొత్తగా టెండర్లు పిలుస్తారు.
సర్కారీ...చౌక మద్యం!
Published Sun, Jun 21 2015 12:10 AM | Last Updated on Sun, Sep 3 2017 4:04 AM
Advertisement