వామ్మో ఏపీ చీప్‌లిక్కరా?
♦ చీప్‌లిక్కర్ ధరను 25 శాతం తగ్గించిన అక్కడి సర్కార్
♦ 180 ఎంఎల్ సీసా ధర తెలంగాణలో రూ. 60, ఏపీలో రూ.45
♦ 15 రోజుల్లో అక్కడి డిస్టిలరీల నుంచి మార్కెట్‌లోకి...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చీప్‌లిక్కర్‌కు ఉన్న డిమాండ్‌ను ఏపీ సీఎం చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారా? ఏపీలో డిమాండ్ లేని చీప్‌లిక్కర్ ధరను తగ్గించి, ఉత్పత్తి పెంచి తెలంగాణకు అక్రమ మార్గాల ద్వారా పంపేందుకు గేట్లు తెరిచారా? అవుననే అంటున్నారు రాష్ర్ట ఆబ్కారీ శాఖ అధికారులు. తెలంగాణలో గుడుంబా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల వల్ల చీప్‌లిక్కర్ డిమాండ్ బాగా పెరిగింది. రాష్ట్రంలోని ఐదు డిస్టిలరీలు నెలకు మూడున్నర లక్షల పెట్టెల (ఒక పెట్టెకు 180 ఎంఎల్ సీసాలు 48) చీప్‌లిక్కర్‌ను ఉత్పత్తి చేస్తున్నా గత నెలలో నాలుగు జిల్లాల్లో తీవ్ర కొరత ఏర్పడింది.
గుడుంబాపై యుద్ధం ఇలాగే కొనసాగితే తెలంగాణలో నెలకు 5 లక్షల పెట్టెలు అవసరమని ఆబ్కారీ శాఖ నిర్ధారించింది. ఈ పరిణామాలను ఏపీ సర్కార్ అనుకూలంగా మలుచుకుంటోంది. అక్టోబర్ 21న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏపీలో చీప్‌లిక్కర్‌పై వ్యాట్‌ను 50 శాతం (190 నుంచి 140 శాతానికి) మేర తగ్గించింది. ఈ ఉత్తర్వులు మరో 15 రోజుల్లో కార్యరూపం దాల్చనున్నాయి. తద్వారా ఏపీలో చీప్‌లిక్కర్ ధరలు ఏకంగా 25 శాతం తగ్గనున్నాయి. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణల్లో 180 ఎంఎల్ చీప్‌లిక్కర్ ధర రూ.60 ఉండగా, ఇకపై ఏపీలో రూ. 45కే లభించనుంది. అలాగే 90 ఎంఎల్, 60 ఎంఎల్ పరిమాణంలో పెట్‌బాటిల్స్‌లో ఉత్పత్తికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తద్వారా 90 ఎంఎల్ సీసా రూ. 25కు, 60 ఎంఎల్ సీసా రూ.15కే మందుబాబులకు లభించనుంది.
పొంచివున్న అక్రమ ర వాణా ముప్పు
ఏపీలోని 13 జిల్లాల్లో చీప్‌లిక్కర్ వినియోగం అతి తక్కువ. మొత్తం విక్రయాల్లో 15-20 శాతమే ఉంటుంది. అక్కడ మీడియం, ప్రీమియం లిక్కర్‌లకే అధిక డిమాండ్ ఉండగా, చీప్‌లిక్కర్‌ను 30 శాతం మేర ఉత్పత్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంపై టీ సర్కార్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్కడున్న 8 డిస్టిలరీల్లో చీప్‌లిక్కర్ ఉత్పత్తికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ రెండు డిస్టిలరీల నుంచే చౌకమద్యం తయారవుతుండగా, వాటి సామర్థ్యం పెంచడంతో పాటు మిగతా డిస్టిలరీల్లోనూ చీప్‌లిక్కర్ ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
తెలంగాణలో ఉన్న డిమాండ్‌ను ఆసరాగా తీసుకొని ఏపీ చీప్‌లిక్కర్‌ను తరలించే కుట్ర జరుగుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ ద్వారా రాష్ట్రంలోకి అక్రమ రవాణా చేస్తారని భావిస్తున్నారు. దీంతో ఈ మూడు జిల్లాల్లో నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని ఇటీవల ప్రభుత్వం ఆబ్కారీ శాఖను ఆదేశించింది. రెండ్రోజుల క్రితం కమిషనర్ చంద్రవదన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో సమావేశమై కార్యాచరణ రూపొందించారు. అనుభవమున్న సిబ్బందిని ఆ మూడు జిల్లాలకు పంపి అక్రమంగా వచ్చే చీప్‌లిక్కర్‌ను అడ్డుకోవాలని నిర్ణయించారు. తెలంగాణలో చీప్‌లిక్కర్ ఉత్పత్తి అవుతున్న 5 డిస్టిలరీల్లో సామర్థ్యం పెంచాలని నిర్ణయించారు.