‘ఐదో’ విలువైన ఆటగాడు
‘ఫోర్బ్స్’ విలువైన ప్రపంచ అథ్లెట్ల జాబితాలో ధోనికి ఐదో స్థానం
న్యూయార్క్: భారత కెప్టెన్ ఎం.ఎస్.ధోని... ప్రపంచంలో విలువైన అథ్లెట్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ‘ఫోర్బ్స్’ తయారు చేసిన ఈ జాబితాలో భారత్ నుంచి కేవలం మహీ ఒక్కడికే స్థానం దక్కింది. 2014లో ధోని బ్రాండ్ విలువ 20 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.122 కోట్లు)గా లెక్కగట్టింది. గతేడాదితో పోలిస్తే ధోని బ్రాండ్ విలువ 1 మిలియన్ డాలర్లు తగ్గింది. అయినా ధోని ఐదో స్థానంలో నిలిచాడు. 2013 చివర్లో స్పార్టన్ స్పోర్ట్స్, అమిటీ యూనివర్సిటీలతో కుదుర్చుకున్న బ్యాట్ ఒప్పందంతో ధోని బ్రాండ్ విలువ బాగా పెరిగిందని ఫోర్బ్స్ తెలిపింది.
బ్యాట్ కోసం రీబాక్ ఏడాదికి 1 మిలియన్ డాలర్లు ఇస్తే... స్పార్టన్ 4 మిలియన్ డాలర్లు చెల్లించిందని వెల్లడించింది. అమెరికా బాస్కెట్ బాల్ స్టార్ ప్లేయర్ లీబ్రాన్ జేమ్స్ (37 మిలియన్ డాలర్లు) ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... టైగర్ వుడ్స్ (36 మిలియన్ డాలర్లు), రోజర్ ఫెడరర్ (32 మిలియన్ డాలర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్, రియల్ మాడ్రిడ్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో, లియోనాల్ మెస్సీ (అర్జెంటీనా), రాఫెల్ నాదల్ టాప్-10లో ఉన్నారు.