ధోని సంపాదన ఎంతో తెలుసా!
‘ఫోర్బ్స్’ ధనిక అథ్లెట్ల జాబితాలో 23వ స్థానం
న్యూయార్క్ : ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన అథ్లెట్ల జాబితాలో భారత క్రికెటర్ ఎం.ఎస్.ధోని మరోసారి స్థానం దక్కించుకున్నాడు. ఏడాదికి 31 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. 198 కోట్లు) సంపాదనతో 23వ స్థానంలో నిలిచాడు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఒక స్థానం కిందకు దిగాడు. ఎం.ఎస్.కు ఆట ద్వారా 4 మిలియన్ డాలర్లు, వాణిజ్య ప్రకటనల ద్వారా 27 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తోంది. ప్రముఖ ‘ఫోర్బ్స్’ మ్యాగజైన్ 100 మందితో కూడిన ఈ జాబితాను ప్రకటించింది.
అయితే భారత్ నుంచి ఒక్క మహీ మినహా మిగతా వారెవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం. అమెరికా బాక్సింగ్ స్టార్ ఫ్లాయిడ్ మెవెదర్ 300 మిలియన్ డాలర్ల (రూ. 1900 కోట్లు)తో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. గతేడాదితో పోలిస్తే ఈసారి మెవెదర్ సంపాదన రెట్టింపు అయ్యింది.ఫిలిప్పిన్స్ బాక్సర్ మ్యానీ పాకియావో 160 మిలియన్ డాలర్లు (రూ. 1022 కోట్లు), రొనాల్డో 79.6 మిలియన్ డాలర్లు (రూ. 500 కోట్లు) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.