రూ.1కే చల్లని మంచినీరు!
నేటి నుంచి వరంగల్లో కొత్త పథకం
సాక్షి ప్రతినిధి, వరంగల్: కేవలం రూపాయికే లీటరు చల్లని మంచినీరు సరఫరా చేసే కార్యక్రమం వరంగల్లో మొదలవుతోంది. బాల వికాస స్వచ్ఛంద సంస్థ, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి అమలు చేయనున్నాయి. గ్రేటర్ వరంగల్ వాసులకు రూపాయికే లీటరు చల్లని మంచి నీరందించేందుకు ప్రధాన రహదారి పొడవునా 11 ప్రత్యేక నీటి సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. బాల వికాస సుజల్ ఏటీడబ్ల్యూ (ఎనీ టైమ్ వాటర్) పేరిట అమలయ్యే ఈ కార్యక్రమంలో మొదటి దశలో నాలుగు పంపిణీ కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. నీటి పంపిణీ కేంద్రాలకు సరఫరా చేసేందుకు వడ్డేపల్లి చెరువు వద్ద గంటకు ఆరు వేల లీటర్ల నీటిని శుద్ధీకరణ చేసే ఈ కేంద్రాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. దేశంలోనే మొదటిసారిగా వరంగల్లో అందిస్తున్నామని బాలవికాస ఈడీ తెలిపారు.