గ్యాంగ్ రేప్: ఆర్మీ ఉన్నతాధికారి కొడుక్కి జైలుశిక్ష
బీజింగ్‌లో ఓ మహిళపై సామూహిక అత్యాచార ఘటనలో చైనా ఆర్మీ ఉన్నతాధికారి పుత్రరత్నం లీ తియానీ ప్రమేయం ఉందని స్థానిక కోర్టు నిర్థారించింది. ఈ నేపథ్యంలో లీ తియానికి 10 ఏళ్ల జైలు శిక్షను బీజింగ్ మున్సిపల్ నంబర్ వన్ ఇంటర్మీడియట్ కోర్టు ఖరారు చేసింది. ఈ మేరకు స్థానిక మీడియా బుధవారం కథనాన్ని ప్రచురించింది. చైనా రాజధాని బీజింగ్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ఓ మహిళపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు.
ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దేశంలోని బడబాబులు పుత్రరత్నాలకు ఆ ఘటనతో సంబంధం ఉందని విపక్షాలతోపాటు దేశ ప్రజలు ముక్తకంఠంతో నినదించారు. అందులోభాగంగా నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో సామూహిక అత్యాచారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
దాంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే అత్యాచారం ఘటనతో తన కుమారుడికి ఎటువంటి సంబంధంలేదని లీ తాయాని తండ్రి మేజర్ జనరల్ లీ షుయన్జియాంగ్ కోర్టుకు విన్నవించారు. లీ షుయన్జియాంగ్ చైనా ఆర్మీలో అత్యున్నత అధికారిగా పని చేస్తున్నారు. ఆమె భార్య, లీ తాయాని తల్లీ కూడా ఆర్మీలో గాయకురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు.