ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఏడో తరగతి విద్యార్థి మహేశ్(12) కేసు మరో మలుపు తిరిగింది. మహేశ్ ఆత్మ హత్యకు పాల్పడడానికి ముందే తలపై బలమైన గాయమయిందని పోలీసలు తెలిపారు. స్కూల్ ఫీజు వేధింపుల వల్లే హైదరాబాద్‌లోని కవాడిగూడలో గల లిటిల్ ప్లవర్ హైస్కూల్ విద్యార్థి మహేశ్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం ఖండించింది. కాగా మహేశ్ ఆత్మ హత్యకు ముందే తలపై బలమైన గాయమయిందని పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్ట్‌లో వెల్లడైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోర్ట్‌మార్టం అనంతరం మృత దేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
జరిగిందేంటి
కవాడిగూడ ప్రధానరోడ్డులోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో మహేశ్ 7వ తరగతి చదువుతున్నాడు. రోజులానే బుధవారం ఉదయమే నాగమణి పనికి వెళ్లింది. కొద్దిసేపటికే ఊరి నుంచి శ్రీనివాస్ ఇంటికి రాగా తాళం వేసి ఉంది. మహేశ్ వద్దనున్న తాళం చెవి కోసమని అతడు స్కూల్‌కు వెళ్లాడు.అయితే, మహేశ్ 2 రోజుల నుంచి స్కూలుకు రావడంలేదని ప్రిన్సిపాల్ చెప్పారు. ఇంటికి వెనుదిరిగి వచ్చేసరికి మహేశ్ టీవీ చూస్తూ కనిపించాడు. స్కూల్‌కు ఎందుకెళ్లలేదని తండ్రి మందలించగా ఫీజు కట్టాలని టీచర్లు అడుగుతున్నారని, అందుకే వెళ్లలేదని చెప్పాడు. కొద్దిసేపటికి బయటకు వెళ్లిన శ్రీనివాస్ తిరిగి ఇంటికి వచ్చేసరికి లోపల గడియపెట్టి ఉంది. తలుపులు పగులకొట్టి లోనికి వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు మహేశ్ వేలాడుతూ కనిపించాడు. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.