స్వలింగ సంపర్కం, సహజీవనం మానవాళికే ముప్పు
ముంబై: సహ జీవనం , స్వలింగ సంపర్కం వంటి చర్యలు మనిషి మనుగడకే ప్రమాదమని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది. సమాజానికి చేటు చేసే ఈ తరహా ఘటనలకు తాము ఎప్పటికీ వ్యతిరేకమని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి జోషి తెలిపారు. స్వలింగ సంపర్కం, సహన జీవనం వంటి చర్యలతో ఒక్క భారతదేశమే కాకుండా యావత్తు మానవ జాతికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు ఆమోదయోగ్యం కాదన్న సంగతి ప్రతి ఒక్కరూ తమకు తాముగా తెలుసుకోవాలని జోషి తెలిపారు. దీనికి సంబంధించిన చట్టాలను ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాల్సి ఉందన్నారు.
నచ్చిన వారితో సహజీవనం చేయడానికి, స్వలింగ సంపర్కం వ్యసనపరులకు టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా మద్దతు తెలపడాన్ని ప్రశ్నించగా..అది ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా జోషి కొట్టిపారేశారు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా అభిప్రాయాలను చెప్పే క్రమంలోనే ఈ తరహా చర్యలను సమర్ధించారన్నారు. భారతీయ సంస్కృతి -సంప్రదాయాల గురించి పిల్లలకు చెప్పే బాధ్యతను ఆయా కుటుంబాలే స్వీకరించాలన్నారు.