పులపత్తూరులో హత్య
చెడు వ్యసనాలు ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడి పాలిట శాపంగా మారాయి. తన చెడు అలవాట్ల కోసం కుటుంబ పరువును బజారుకు ఈడ్చడమే గాక, కుటుంబ సభ్యులను హింసిస్తుండడంతో వారు విసుగెత్తిపోయారు. ఎలాగైనా కుటుంబ సభ్యులకు మనశ్శాంతితో పాటు కుటుంబ పరువును కాపాడుకోవాలన్న ఉద్దేశంతో రక్త సంబంధాన్ని మరచిన ఓ అన్న సొంత తమ్ముడినే హతమార్చాడు.
రాజంపేట, న్యూస్‌లైన్ : రాజంపేట మండలం పులపత్తూరులో జి.రాజశేఖరరెడ్డి అలియాస్ రాజారెడ్డి(24) గురువారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. చెడు వ్యసనాలకు బానిసై, కుటుంబ సభ్యుల పాలిట యమకింకరుడిగా మారిన రాజారెడ్డి మేడపై నిద్రిస్తుండగా హత్యకు గురయ్యాడు. బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లిన అతను మూడేళ్ల అనంతరం 11 నెలల కిందట స్వగ్రామానికి చేరుకున్నాడు. అప్పటి నుంచి పనీ పాట లేక జులాయిగా తిరిగేవాడు. ఈ క్రమంలో దుర్వ్యసనాలకు అలవాటుపడ్డాడు. ఈ నేపథ్యంలో అతను కిరాతకంగా హత్యకు గురి కావడం సంచలనం రేకెత్తించింది.
నేర స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, సీఐలు
విషయం తెలిసిన వెంటనే రాజంపేట డీఎస్పీ అన్యోన్య, సీఐ ఉలసయ్య సహా ఎస్ఐలు జాబిద్, రమేష్‌బాబు, వెంకటేశ్వర్లు, మోహన్, నాగరాజు, రామచంద్ర సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
డ్వాగ్ స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దింపారు. హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాల కోసం వారంతా శోధించారు. హతుడి నడవడిక, కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో అతను ప్రవర్తించే తీరుపైనా ఆరా తీశారు. క్రికెట్ బెట్టింగ్‌కు బానిసగా మారిన విధానాన్ని కూడా తెలుసుకున్నారు. సంఘటనపై ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.