Live Wire
-
తీవ్ర విషాదం : స్నానం చేస్తుండగా..
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. స్నానం కోసం బావిలోకి దిగిన నలుగురు బాలురు ప్రాణాలు కోల్పోయారు. కరెంట్ తీగ బావిలో పడి షాక్ తగలడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. సంబల్ జిల్లాలోని పెటియాన్ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా పోలీసు బలగాలను మోహరించారు. స్నానం చేసేందుకు నలుగురు మైనర్ బాలురు స్థానిక వ్యవసాయ బావిలోకి దిగారు. సరిగ్గా అదే సమయంలో అక్కడే ఉన్న ట్రాన్స్ఫార్మర్కు చెందిన కరెంట్ వైర్ తెగి ఆ నీటిలో పడి విద్యుత్ షాక్ తగిలింది. కొంతసేపటికి అటుగా వెళుతున్న రైతు పిల్లలు స్పృహ కోల్పోయిన ఉన్నట్లు గుర్తించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్తు సరఫరాను నిలిపివేసారు. అనంతరం పిల్లలను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే నలుగురు మరణించారని వైద్యులు ధృవీకరించారు. చనిపోయిన వారిలో విష్ణు (11), శివం(7) ఇద్దరూ అన్నదమ్ములు. కాగా మిగిలిన ఇద్దర్నీ ధర్మవీర్(11), గణేష్ (11) గా గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు మొదలు పెట్టారు. మరోవైపు దీనిపై మూడు రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా ఉన్నతాధికారులకు జిల్లా మేజిస్ట్రేట్ అవినాష్ క్రిషన్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై అనుమానాలు వెల్లువెత్తిన నేపథ్యంలో దీనిపై రిపోర్టు ఇవ్వాల్సిందిగా విద్యుత్తుశాఖను కోరినట్టు తెలిపారు. -
హర్లే డేవిడ్సన్.. తొలి ఎలక్ట్రిక్ బైక్
న్యూఢిల్లీ: హర్లే డేవిడ్సన్ కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్.. లైవ్‌వైర్‌ను ఆవిష్కరించింది. ఇది అమ్మకానికి కాదని, వినియోగదారులకు అవగాహన కలిగించడానికేనని కంపెనీ ప్రెసిడెంట్, సీఓఓ మ్యాట్ లెవటిచ్ చెప్పారు. వచ్చే వారం నుంచి ఎంపిక చేసిన వినియోగదారులకు ఈ బైక్‌ను నడిపే అవకాశాన్నిస్తామని పేర్కొన్నారు. వారి నుంచి సేకరించే అభిప్రాయాల ఆధారంగా తమ తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను మరింత పటిష్టంగా రూపొందిస్తామని వివరించారు. మారుతున్న సామాజిక పరిస్థితులు, అవసరాలకనుగుణంగా ఎప్పటికప్పుడు బైక్‌లను అందిస్తున్నామని పేర్కొన్నారు. దీంట్లో భాగంగానే ప్రాజెక్ట్ రష్మోర్ టూరింగ్ బైక్‌లు, హర్లే-డేవిడ్సన్ స్ట్రీట్ 500, 750 మోడళ్లను అందించామన్నారు. గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే ఈ బైక్ 0 నుంచి 60 మైళ్ల వేగాన్ని(గంటకు) 4 సెకన్లలో అందుకుంటుంది. 210 కిమీ. ప్రయాణం తర్వాత బ్యాటరీలను రీచార్జ్ చేయాల్సి ఉంటుంది. రీచార్జ్ సమయం అరగంట నుంచి గంట వరకూ ఉంటుంది.