హర్లే డేవిడ్సన్.. తొలి ఎలక్ట్రిక్ బైక్
న్యూఢిల్లీ: హర్లే డేవిడ్సన్ కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్.. లైవ్‌వైర్‌ను ఆవిష్కరించింది. ఇది అమ్మకానికి కాదని, వినియోగదారులకు అవగాహన కలిగించడానికేనని కంపెనీ ప్రెసిడెంట్, సీఓఓ మ్యాట్ లెవటిచ్ చెప్పారు. వచ్చే వారం నుంచి ఎంపిక చేసిన వినియోగదారులకు ఈ బైక్‌ను నడిపే అవకాశాన్నిస్తామని పేర్కొన్నారు. వారి నుంచి సేకరించే అభిప్రాయాల ఆధారంగా తమ తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను మరింత పటిష్టంగా రూపొందిస్తామని వివరించారు.
మారుతున్న సామాజిక పరిస్థితులు, అవసరాలకనుగుణంగా ఎప్పటికప్పుడు బైక్‌లను అందిస్తున్నామని పేర్కొన్నారు. దీంట్లో భాగంగానే ప్రాజెక్ట్ రష్‌మోర్ టూరింగ్ బైక్‌లు, హర్లే-డేవిడ్సన్ స్ట్రీట్ 500, 750 మోడళ్లను అందించామన్నారు. గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే ఈ బైక్ 0 నుంచి 60 మైళ్ల వేగాన్ని(గంటకు) 4 సెకన్లలో అందుకుంటుంది. 210 కిమీ. ప్రయాణం తర్వాత బ్యాటరీలను రీచార్జ్ చేయాల్సి ఉంటుంది. రీచార్జ్ సమయం అరగంట నుంచి గంట వరకూ ఉంటుంది.