టార్క్.. యువతరం బైక్!
చూడగానే కుర్రకారుకు హుషారు తెప్పించే ఈ బైక్ పేరు టార్క్6 ఎక్స్. ఇది యువత కలలకు ప్రతిరూపమనే చెప్పుకోవచ్చు! దీని ప్రత్యేకత ఏంటంటే దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్. అంటే కరెంట్‌తో పనిచేస్తుందన్న మాట. కేవలం గంటసేపు చార్జింగ్ పెడితే చాలు.. వంద కిలోమీటర్ల దూరం హాయిగా ప్రయాణించవచ్చు. పెట్రోల్‌తో నడిచే బైక్‌లతో ఏ విషయంలోనూ ఇది తీసిపోదు. స్టైల్‌కు స్టైలు.. మైలేజికి మైలేజీ అన్నమాట. పుణేలోని డీవై పాటిల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివిన 30 ఏళ్ల కపిల్ షెల్కే దీన్ని రూపొందించాడు. కాలేజీ రోజుల్లోనే ప్రాజెక్టులో భాగంగా ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేశాడు.
2009లో ఐల్ ఆఫ్ మాన్‌లో జరిగిన ఎలక్ట్రిక్ వాహనాల రేసింగ్ పోటీల్లో పాల్గొన్న ఈ టార్క్ 01 అనే బైక్ గంటకు 156 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయి మూడో స్థానంలో నిలిచింది. అలాగే 2010లో జరిగిన పోటీల్లో పాల్గొని రికార్డు స్థాయిలో 214 కిలోమీటర్ల వేగం అందుకుంది. కొన్నేళ్ల పాటు చైనాలో ఓ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బైక్‌ల కంపెనీ తరఫున రేసుల్లో షెల్కే పాల్గొని ఈ టార్క్‌ను మరింతగా అభివృద్ధి చేశాడు. సాధారణ పెట్రోల్ బైక్‌ను మార్చి ఎలక్ట్రిక్ బైక్‌గా తయారు చేశాడు. 2014లో గుజరాత్‌లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శితమైన టీఎక్స్-05కు మంచి ఆదరణ లభించడంతో దానికి మరిన్ని మెరుగులు దిద్ది టీ06 ఎక్స్‌ను రూపొందించాడు. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే ఏడాదిలోగా ఈ బైక్‌లు రోడ్లపై దూసుకెళ్తాయి.