అస్తమించని సౌందర్యం
నేడు సౌందర్య వర్థంతి
వెన్నెల... ఆకాశంలోనే ఉంటుంది! ఆ పరిమళం మాత్రం పుడమినంటుకునే సాగుతుంది! సౌందర్య కూడా అంతే! స్వల్పకాలంలో ఆకాశమంత ఎత్తుకెదిగిపోయింది. మన దురదృష్టం. ఆకాశంలోనే ఉండిపోయింది. కానీ ఆమె జ్ఞాపకాలు మాత్రం ఇంకా మనల్ని తరుముతూనే ఉన్నాయ్ వాటిలో ఇవి కొన్ని...
* ఫేమస్ రైటర్ త్రిపురనేని మహారథి కొడుకు త్రిపురనేని వరప్రసాద్ (చిట్టి) ‘రైతు భారతం’ సినిమా డెరైక్ట్ చేస్తున్నారు. కృష్ణంరాజు (ఈ పాత్రలో తర్వాత కృష్ణ నటించారు), భానుచందర్ హీరోలు. కృష్ణంరాజు పక్కన వినయ ప్రసాద్ అనే ఆర్టిస్టుని బుక్ చేయడానికి బెంగళూరు వెళ్లారు చిట్టి. కనిష్క హోటల్లో రచయిత, దర్శక, నిర్మాత సత్యనారాయణ తారసపడి, వాళ్లమ్మాయి సౌమ్య స్టిల్స్ చూపించారు. చిట్టికి నచ్చి, భానుచందర్ పక్కన హీరో యిన్‌గా వెంటనే తీసేసుకున్నాడు. అప్పటికే సౌమ్య కన్నడంలో ‘గంధర్వ’ అనే సినిమా చేస్తోంది. ఆ సౌమ్యే మన సౌందర్య.
* ‘రైతు భారతం’ ఒక షెడ్యూలు జరుగుతుంటే పి.ఎన్.రామచంద్రరావు తను తీస్తున్న ‘మనవరాలి పెళ్లి’లో హీరోయిన్గా సౌందర్యను తీసుకున్నారు. ముందు ఈ సినిమానే రిలీజైంది. ఆ తర్వాత ‘అమ్మోరు’ లాంటి సినిమాలు కమిట్ అయ్యిందామె. 11 ఏళ్లల్లో వందకు పైగా సినిమాలు చేసింది.
* రాజీవ్ మీనన్ డెరైక్ట్ చేసిన ‘కండు కొండేన్ కండు కొండేన్’ (తెలుగులో ‘ప్రియురాలు పిలిచింది’)లో ఐశ్వర్యారాయ్ పాత్రకు మొదట సౌందర్యనే అడిగారు.
* సౌందర్యకు ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’లో మీనాకుమారి, ‘ఫిజా’లో కరిష్మా కపూర్ చేసిన పాత్రల్లాంటివి చేయాలని ఉండేది. చెవిటి, మూగపిల్లగా నటించాలని కోరిక. అవకాశమొస్తే విలనీ కూడా చేద్దామను కున్నారు. గోవింద్ నిహలానీ, శ్యామ్ బెనగళ్ సినిమాల్లో చేయాలని ఎంతగా ఆశపడ్డారో!
* కెరీర్ తొలినాళ్ల నుంచీ బంజారాహిల్స్‌లోని ‘ప్రశాంత్ కుటీర్’ అనే గెస్ట్‌హౌస్‌లోనే బస చేసేవారు. రూమ్ నం.10 ఆమెకు పర్మినెంట్. ఫైవ్‌స్టార్ ఫెసిలిటీ ఇస్తామని ప్రొడ్యూసర్లు చెప్పినా, ఆమె ప్రశాంత్ కుటీర్‌ను వదల్లేదు.
* గిరీశ్ కాసరవల్లి డెరైక్షన్‌లో ‘ద్వీప’ సినిమాను నిర్మించారు. దానికి నేషనల్ అవార్డు వచ్చింది.
* ‘తిలదానం’తో నేషనల్ అవార్డు సాధించిన కేఎన్టీ శాస్త్రి దర్శకత్వంలో ‘కమ్లీ’ సినిమా చేయాలని ఆమె ఎంతగానో ముచ్చటపడ్డారు. శాస్త్రిని రెండు, మూడుసార్లు బెంగళూరుకు పిలిపించుకుని స్టోరీ, బడ్జెట్ గురించి డిస్కస్ చేశారు. సినిమా స్టార్ట్ చేయడమే తరువాయి అనుకుంటున్న సమయంలో కన్నడంలో ‘ఆప్తమిత్ర’ సినిమా ఆఫర్ రావడంతో ‘కమ్లీ’ని రెండు నెలలు వాయిదా వేశారు.
* సౌందర్య తొలి పారితోషికం ఎంతో తెలుసా? పాతిక వేల రూపాయలు. ‘రైతు భారతం’ సినిమాకి ఆమె తీసుకున్నది ఇంతే. ఆ తర్వాత ఆమె 50 లక్షల రేంజ్‌కు చేరుకున్నారు.
* ఎప్పటికైనా డెరైక్షన్ చేయాలనుకున్నారామె. ‘శ్వేతనాగు’ ప్రొడ్యూస్ చేసిన సీవీ రెడ్డి, ఇందుకు సిద్ధమయ్యారు కూడా.
* సౌందర్యకు వాటర్ ఫోబియా ఉంది. నీళ్లంటే భయం. సుడిగుండాలంటే మహా భయం. నీళ్ల బకెట్లో పడిపోతానేమోనని కూడా భయపడిపోయే వారట. చివరకు షవర్ బాత్ చేయడానికి కూడా టెన్షన్ పడిపోయేవారట.
* ‘లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్’ అనే పుస్తకం ఆమెను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. తండ్రి మరణం నుంచి కోలుకోవడానికి సౌందర్యకు ఈ పుస్తకమే సహకరించిందట.
* సౌందర్య ఫాదర్ సత్యనారాయణకు జాతకాలు బాగా తెలుసు. తన కూతురు పదేళ్లకు పైగా ఇండస్ట్రీని ఏలుతుందని, అందరు హీరోలతోనూ నటిస్తుందని, 2004లో ఆమె కెరీర్ సమాప్తమవుతుందని ఆయన ముందే జోస్యం చెప్పారు. కానీ ఆమె కెరీర్ కాదు, లైఫే ఎండ్ అయిపోయింది.
* 2004 ఏప్రిల్ 17 మధ్యాహ్నం గం.1:14 నిమిషాలకు బెంగళూరులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె కన్నుమూశారు. ఆమెతో పాటు అన్నయ్య అమర్ కూడా నేలరాలి పోయారు. అప్పటికామెకు సాఫ్ట్వేర్ ఇంజినీర్ రఘుతో పెళ్లయ్యి ఏడాది కూడా కాలేదు. కరీంనగర్ జిల్లాలో బీజేపీకి సపోర్ట్‌గా ఎన్నికల సభలో పాల్గొనడానికి వెళ్తూ ఇలా తన ప్రయాణాన్ని అర్ధంతరంగా ముగించారు.
* చనిపోవడానికి కొద్దిరోజుల ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చావు గురించి సౌందర్య ఇలా అన్నారు - ‘‘చావంటే నాకు చాలా భయం. చిన్నప్పుడు చావు గురించి రక రకాలుగా ఆలోచించేదాన్ని. చచ్చిపోయాక స్వర్గానికి వెళ్తామని, స్వర్గం ఆకాశంలో ఉంటుందని.. ఇలా ఏవేవో పిచ్చి ఆలోచనలు చేసేదాన్ని. విమానాల్లో ప్రయాణించేటప్పుడు కిటికీ ల్లోంచి కనిపించే మేఘాలను చూస్తే మాత్రం చచ్చిపోయాక ఇక్కడకు వస్తామన్నమాట అని అనిపిస్తూ ఉంటుంది.’’