నాకంటే నాలుగేళ్లు పెద్దది... పెళ్లాడవచ్చా?
జీవన గమనం
నాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి ఎనిమిదో తరగతి, అమ్మాయి ఆరో తరగతి. ఈ మధ్య వాళ్లిద్దరూ డిబ్బీల్లోంచి డబ్బులు దొంగిలించి, బయట అవీ ఇవీ కొనుక్కుని తింటున్నారు. దాదాపు ఎనిమిది వందల రూపాయలు అలా ఖర్చు చేశారు. వాళ్లు స్కూలు నుంచి వచ్చేసరికి ఫుడ్ రెడీగా ఉంచుతాం. అయినా వాళ్లు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ అలవాటును మాన్పించి వాళ్లని సరైన మార్గంలో ఎలా పెట్టాలి?
- పవన్, మెయిల్
ఎనిమిది వందలు దొంగతనం చేసేటంతగా వాళ్లు ఏం తిన్నారు? బయట తినడం కోసమే వాళ్లు దొంగతనం చేస్తున్నారని మీరెలా నిర్ధారణకి వచ్చారు? నెల రోజుల్లో ఎనిమిది వందలు ఖర్చు పెట్టారంటే, స్నేహితులందరూ కలిసి తింటున్నారా? ముందు ఆ విషయం కనుక్కోండి. ఇది తిండికి సంబంధించిన వ్యవహారంలా అనిపించడం లేదు.
ఇకపై డబ్బులు కనబడకుండా దాచేయడమే దీనికి పరిష్కారం. వాళ్ల దొంగతనం మీకు తెలిసిందన్న విషయం వాళ్లకి తెలిసేలా చేయాలి. కొట్టినా, తిట్టినా అది ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. సున్నితంగా వ్యవహరించి తెలుసుకోండి. వాళ్ల దొంగతనం విషయం మీకు తెలిసిందని గ్రహించిన తర్వాత కూడా వాళ్లు అదే పని చేస్తుంటే కనుక, ఎవరైనా మనస్తత్వ శాస్త్ర నిపుణుడి దగ్గరకు తీసుకు వెళ్లండి.
నేను ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువు తున్నాను. నాకు మా ఇంగ్లిష్ మేడమ్ అంటే చాలా ఇష్టం. ఆవిడకు కూడా నేనంటే ఇష్టం. తను ఒక అనాథ. నాకంటే నాలుగేళ్లు పెద్ద. అయినా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది మా వాళ్లకి ఇష్టం లేదు. నేను నా ఇష్టానికి ప్రాధాన్యతనివ్వాలా లేక కుటుంబానికా?
- గోపీకిషన్, అనంతపురం
ఏదైనా సమస్యకి పరిష్కారం ఆలోచించ వలసి వచ్చినప్పుడు... మనకు కలిగే లాభాలు, వచ్చే నష్టాలు రెండూ ఆలోచించుకోవాలి. ఈ లాభనష్టాలనేవి మానసిక, ఆర్థిక అంశాలతో పాటు సెంటిమెంటుకు కూడా సంబంధించినవి. ఒక నిర్ణయం తీసుకున్న ప్పుడు దానివల్ల మనకే కాకుండా ఇత రులకు వచ్చే సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకి మీకు పెళ్లి కావలసిన చెల్లెళ్లు ఎవరైనా ఉండి, మీది చాలా సనాతనమైన ఆచారాల కుటుంబం కనుక అయితే... మీ ఈ చర్య వల్ల మీ తరువాతి వారికి వివాహం జరగకపోయే పరిస్థితులు వస్తాయనుకుంటే, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
మీ ప్రశ్నకి సమా ధానం చెప్పాలంటే ఇంకా లోతుగా వివరాలు కావాలి. మీ తల్లిదండ్రుల మన స్తత్వం ఎలాంటిది? మీరు తీసుకున్న నిర్ణయం వల్ల వాళ్లు కృంగి, కృశించి పోతారా? లేక కొంత కాలానికి మామూ లుగా అయిపోతారా? ఇది బయటివారి కన్నా మీకే బాగా తెలుస్తుంది. అన్నిటి కన్నా ముఖ్యమైనది... మీరు ఇంజినీరింగ్ తప్పకుండా పాసవుతారా?
ఒకవేళ మీరు ఇంటి నుంచి బయటికొచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటే, మీకు వెంటనే ఉద్యోగం దొరుకుతుందా? ఒకవేళ దొరక్కపోతే ఆవిడ మిమ్మల్ని పోషించగలరా? మీరు ఆమె కన్నా వయసులో చిన్నవారు అన్నది సమస్య కానే కాదు. మీరిద్దరూ మానసికంగా ఎదిగారా లేదా అన్నదే ఇక్కడ సమస్య.
ఒకరిని ప్రేమించాను. సర్వస్వం అర్పించాను. తన కోసమే జీవిస్తున్నాను. కానీ తను నాకు మాత్రమే సొంతం కాలేని పరిస్థితి. అలా అని తన ప్రేమ మీద నాకు అనుమానం లేదు. తనకి నేనంటే ప్రాణం. నాకంటే ముందే తన జీవితంలో ఉన్న భార్యని వదిలెయ్యమని చెప్పలేను. ఎందుకంటే దానివల్ల ఆయనకు సమస్యలు వస్తాయి. కానీ తనకి దూరంగానూ ఉండలేను. తనని బాధపెట్టకుండా ఉండాలంటే నా మనసును రాయి చేసుకోవాలి. తన ప్రేమ ఒక్కటే చాలని అనుకోవాలి. అలా అనుకోవడం చాతకాక నలిగిపోతున్నాను. ఏం చేయమంటారు?
- ఓ సోదరి
తన భార్యతో ఉంటూ మీ సర్వస్వాన్నీ స్వాహా చేసిన వ్యక్తి పట్ల మీ ‘ప్రేమ’ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ కౌన్సిలర్ల దగ్గరకు నెలకో నాలుగు కేసులు ఇలాంటివే వస్తాయి. భార్యతో సుఖంగా సంసారం చేసుకుంటూ, సమాజంలో గౌరవంగా బ్రతుకుతూ, ఒక పెళ్లి కాని అమ్మాయిని అనుభవించేవాడు... ఇంట్లో కడుపు నిండా భోజనం ఉన్నా, బయట తిండికి ఆశపడే మనస్తత్వం ఉన్నవాడు. మీకు అతడి వల్ల పిల్లలు పుట్టినా... వారికి సమాజంలో గౌరవప్రదమైన స్థానం దొరక్కపోవచ్చు.
మీలాగే వాళ్లూ బాధ పడవచ్చు. అయినా ఇప్పుడు సమస్య అతనిది కాదు, మీది. మీరు చిన్నపిల్ల కాబట్టి, తన సంసారానికి ఢోకా లేనంతవరకూ మీతో ఇలా ఉంటున్నాడు. మీకు కొంత వయసు వచ్చిన తర్వాత మీపట్ల మొహం మొత్తినా, అతని పిల్లలు ఎదిగివచ్చి తన సెక్యూరిటీకి భంగం కలుగుతుంది అనుకున్నా... నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని వదిలేస్తాడు. మీకు అతని పట్ల ఉన్నది ప్రేమ కాదు, వ్యామోహం. దాన్ని తగ్గించుకుని, ఒక మంచి అభిరుచిని పెంచుకుని, జీవితాన్ని మరోవైపు మళ్లించుకోండి. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించే (మిమ్మల్నొక్కరినే) వ్యక్తిని ఎన్నుకోండి. బెస్టాఫ్ లక్.
- యండమూరి వీరేంద్రనాథ్