లియోనియా రిసార్ట్స్‌పై సీబీఐ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: వందల కోట్ల రూపాయల రుణాలు పొంది బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టిన లియోనియా రిసార్ట్స్ యాజమాన్యంపై సీబీఐ కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా షామీర్పేట మండలం బొమ్మరాసిపేటలో అత్యాధునిక రిసార్టు నిర్మిం చేందుకు ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ నుంచి రూ.120 కోట్ల రుణాన్ని పొంది ఎగనామం పెట్టారనే ఆరోపణలపై రిసార్టు మేనేజింగ్ డెరైక్టర్ జీఎస్ చక్రవర్తుల రాజుపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.
బెంగళూరులోని సీబీఐ బ్యాంకింగ్ మోసాల నిరోధక విభాగం ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ సాగుతోంది. కాగా, లియోనియా రిసార్ట్స్‌పై సీబీఐ కేసు నమోదు చేసిన వార్త సోమవారం రాత్రి రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలంలో కలకలం రేపింది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన రాజు.. బొమ్మరాసిపేట గ్రామంలో 2001లో మొదట 12 ఎకరాల విస్తీర్ణంలో లియోనియా రిసార్ట్స్‌ను ప్రారంభించారు.
ఏటా విస్తీర్ణాన్ని పెంచుకుంటూ పోతుండడంతో ఇప్పుడది 140 ఎకరాలకు చేరింది. ఈ 140 ఎకరాల్లో ఎక్కువ శాతం పేదలకు చెందిన అసైన్ట్ భూములున్నాయని, తమనుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని పలువురు గతంలో లియోనియా వద్ద ఆందోళన చేశారు. తాజాగా 11 బ్యాంకుల్లో సుమారు రూ. 630కోట్లు అప్పు చేసి మోసం చేశారని వస్తున్న వదంతులు స్థానికంగా కలకలం రేపాయి. లియోనియాలో వందల సంఖ్యలో స్థానికులు పనిచేస్తున్నారు.