పేదరిక నిర్మూలనకు రుణాలు
ఏలూరు (మెట్రో): జిల్లాలో పేదరిక నిర్మూలనకు వివిధ కార్పొరేషన్ల ద్వారా పెద్ద ఎత్తున రుణాలను అందించేందుకు ఈనెల 18వ తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించాలని, తర్వాత ఆన్లైన్ నిలిపివేస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. కలెక్టరేట్లో గురువారం ఎస్సీ, బీసీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల అధికారులతో రుణాల మంజూరు తీరుపై సమీక్షించారు. ఇప్పటికే కాపు కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 63 వేలకు చేరిందని కలెక్టర్ చెప్పారు. దరఖాస్తు గడువును పెం^è మని, దశల వారీగా అర్హులందరికీ రుణాలు అందజేస్తామని స్పష్టం చేశారు.
ఇప్పటికే జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కాపు రుణమేళాలు నిర్వహించామని, తాడేపల్లిగూడెం, చింతలపూడి, ఉండి నియోజకవర్గాల పరిధిలో కాపు రుణమేళాలు నిర్వహించి లబ్ధిదారులకు యూనిట్లను అందిస్తే జిల్లా అంతటా కాపులకు పెద్ద ఎత్తున రుణాలు అందించిన ఘనత జిల్లాకు దక్కుతుందని చెప్పారు. దసరా తర్వాత పెద్ద ఎత్తున వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణమేళాలు నిర్వహించి లబ్ధిదారులకు యూనిట్లు అందించాలని అధికారులను ఆదేశించారు. ఏజేసీ షరీఫ్, లీడ్‌బ్యాంకు మేనేజర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఝాన్సీరాణి, మైనారిటీ కార్పొరేషన్ అధికారి శాస్త్రి, బ్రాహ్మణ సమాఖ్య ప్రతినిధి కామేష్ పాల్గొన్నారు.
పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు
పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ నిరోధానికి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేస్తామని కలెక్టర్ భాస్కర్ తెలిపారు. కలెక్టరేట్లో గురువారం విద్యాశాఖ ప్రగతి తీరుపై సమీక్షించారు. సమాజానికి పనికొచ్చేలా విద్యార్థులను తీర్చిదిద్దాలే తప్ప పాస్ కోసం మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించవద్దని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి జిల్లాలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యతో పాటు వివిధ వత్తుల్లో నైపుణ్యం పెంచేలా కొత్త కోర్సులను అమలు చేస్తామని తెలిపారు. టెన్త్ ఫలితాల్లో జిల్లాకు రాష్ట్రంలో ఆఖరి స్థానం వచ్చినా పర్వాలేదు గాని కాపీలను ప్రోత్సహించవద్దని సూచించారు. డీఈవో మధుసూదనరావు, ఎస్ఎస్ఏ పీవో బ్రహ్మానందరెడ్డి, ఉప విద్యాశాఖాధికారి ఉదయ్‌కుమార్, ఏవోఈలు పాల్గొన్నారు.
హాస్టళ్ల పరిశీలనకు ప్రత్యేకాధికారులు
ఏలూరు (మెట్రో): ప్రతి మండలంలోని హాస్టళ్లలో పరిశుభ్రత, వసతుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా జిల్లా అధికారులను నియమించనున్నట్టు కలెక్టర్ కె.భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ శాఖల అధికారులతో సమీక్షించారు. సంక్షేమ, రెసిడెన్షియల్ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలతోపాటు పరిశుభ్రత పర్యవేక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్‌ను ఆదేశించారు. అధికారులు తప్పనిసరిగా హాస్టళ్లను సందర్శించి డార్మెటరీలో ఫ్యాన్, లైట్, దోమల నెట్, టాయిలెట్, తాగునీరు, శానిటేషన్‌పై ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో ఫొటోలు అప్లోడ్ చేయాలన్నారు. దసరా సెలవుల అనంతరం తాను హాస్టళ్లను తనిఖీ చేస్తానని ఏ ఒక్కటి లేకున్నా సంబంధితాధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సాంఘిక సంక్షేమ సోషల్వెల్ఫేర్ డిడి రంగలక్ష్మీదేవి, జిల్లా వెనుకబడినసంక్షేమాధికారి లక్ష్మీప్రసాద్, ఐటిడిఎ డిప్యూటీ డైరెక్టర్ మల్లిఖార్జునరెడ్డి, మైనార్ట సంక్షేమశాఖ జిల్లా అధికారి హెచ్‌విఎస్ మూర్తి పాల్గొన్నారు.
లింగ నిర్ధారణ చట్టం అమలు చేయండి
జిల్లాలో లింగ నిర్ధారణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని వైద్యారోగ్యశాఖాధికారులను కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. కలెక్టరేట్లో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఎన్ని ప్రై వేట్ ఆసుపత్రులు ఉన్నాయి, ఎన్ని స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి, అక్కడకు ఎంత మంది వెళ్లి స్కానింగ్ చేయించుకుంటున్నారనే వివరాలు ఉన్నాయా అని డీఎంహెచ్‌వోను ప్రశ్నించారు. లింగనిర్ధారణపై సరైన తనిఖీలు లేకపోవడం వల్లే జిల్లాలో ఇప్పటివరకూ ఒక్క కేసూ నమోదు కాలేదన్నారు. డీఎంహెచ్‌వో కె.కోటేశ్వరి, డీసీహెచ్ఎస్ శంకరరావు, వైద్యాధికారులు పాల్గొన్నారు.