విజయోత్సవాలతో కాల్పులు.. బాలుడి మృతి
ఉత్తరప్రదేశ్, బిహార్ లాంటి రాష్ట్రాల్లో పెళ్లిళ్లు, ఏవైనా సంబరాలు జరుగుతుంటే గాల్లోకి తుపాకులతో కాల్చడం సర్వసాధారణం. కానీ, యూపీలోని షామ్లి జిల్లాలో స్థానిక ఎన్నికల ఫలితాలు వచ్చిన సందర్భంగా జరిగిన కాల్పుల్లో హర్ష్ అనే తొమ్మిదేళ్ల బాలుడు మరణించాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని నఫీసా విజయం సాధించడంతో సమాజ్‌వాదీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకొంటూ గాల్లోకి కాల్చడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
దాదాపు అరగంట పాటు వాళ్లు తుపాకులు కాలుస్తూనే ఉన్నారు. అదే సమయానికి రిక్షాలో అటువైపుగా వెళ్తున్న హర్ష్‌కు బుల్లెట్ తగిలింది. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరనించాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాలుడి బంధువులు పానిపట్ - ఖాతిమ్ జాతీయ రహదారిని దిగ్బంధించారు.