మళ్లీ దిగివస్తున్న బంగారం ధరలు
- ముంబై బులియన్ మార్కెట్లో రెండు రోజుల్లో రూ.765 డౌన్
- అంతర్జాతీయ బలహీన ధోరణి ప్రభావం
ముంబై: పసిడి, వెండి ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. ఈ రెండు రోజుల్లో ముంబై బులియన్ మార్కెట్లో పసిడి 24 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ.765 పడింది. వెండి కేజీ ధర రూ.1,355 నష్టపోయింది. స్థానిక బులియన్ మార్కెట్లో బుధవారం 10 గ్రాముల పసిడి 24 క్యారెట్ల ధర రూ.355 పడి రూ.26,595కు చేరింది. 22 క్యారెట్ల ధర సైతం అంతే పరిమాణంలో కిందకుదిగి రూ.26,445కు జారింది. వెండి కేజీ ధర రూ.785 పడి రూ.35,045కు చేరింది.
కారణం: అంతర్జాతీయ, దేశీ మార్కెట్లలో ఫ్యూచర్స్ మార్కెట్లో బలహీన ధోరణి, అలాగే స్టాకిస్టులు, ఇన్వెస్టర్ల అమ్మకాలు, దేశీయంగా కొనుగోళ్ల మద్దతు లేకపోవడం వంటి అంశాలు దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
తాజా పరిస్థితి ఇదీ...
కాగా బుధవారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి అంతర్జాతీయ, దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లలో సైతం పసిడి, వెండి ధరలు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. నెమైక్స్ కమోడిటీ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రా) ధర 15 డాలర్ల నష్టంతో 1,123 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా నష్టాల్లో 14 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇందుకు అనుగుణంగా దేశీయ ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాముల ధర 374 నష్టంతో రూ.26,366 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీ ధర ఏకంగా రూ.1,250 నష్టంతో రూ.33,414 వద్ద ట్రేడవుతోంది. తాజా ట్రేడింగ్ ఇదే ధోరణిలో ముగిసి, గురువారం రూపాయి బలహీనపడితే, దేశీయ మార్కెట్లో పసిడి వెండి ధర రేపు (గురువారం) మరింత పడే అవకాశం ఉంది.