పార్టీలకే పట్టం.. స్థానికులంటే ఇష్టం
సాక్షి, కాకినాడ: నగరంలో మొత్తం 50 డివిజన్లు ఉండగా అప్పటిలో కాకినాడ సిటీ మొత్తం ఒకే నియోజకవర్గంగా ఉండేది. 2009 పునర్విభజనలో భాగంగా కాకినాడ సిటీలోని 7 డివిజన్లు కాకినాడ రూరల్ నియోజక వర్గంలో కలిపారు. ప్రస్తుతం 43 డివిజన్లు కాకినాడ సిటీ నియోజక వర్గంలో ఉన్నాయి. కాకినాడ నియోజకవర్గానికి సమీపంలో కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, రామచంద్రపురం నియోజకవర్గాలు నాలుగు వైపులా ఉన్నాయి. ఇక్కడి ఓటర్లు ఎక్కువగా పార్టీ అభ్యర్థులకే పట్టం గడతారు. అది కూడా స్థానికులకే ప్రాధాన్యం ఇస్తారు.
బోట్‌క్లబ్: కాకినాడ నగరం తూర్పుగోదావరి జిల్లా ముఖ్య పట్టణం. జిల్లా ప్రధాన పట్టణమే కాక భారతదేశ తూర్పు తీర ప్రాంతాల్లో ముఖ్యమైన రేవు పట్టణం. న్యూయార్క్ నగరం మాదిరిగా వీధులు రూళ్ల కర్రతో గీసినట్టుగా ఉండి, కూడళ్లు ఒక దానికొకటి సమానంగా ఉండడం నగర ప్రత్యేకత. ప్రణాళికా బద్ధంగా ఉన్న కారణంగా కో– కెనడాగా పిలిచేవారు. ప్రముఖమైన ఓడరేవుగా ఉన్న కారణంగా రెండవ మద్రాసుగాను, చమురు అన్వేషణ, వెలికితీత కార్యక్రమాలు అధికంగా ఉండడంతో మినీ ముంబయిగా పిలుస్తుంటారు. ప్రశాంత వాతావరణానికి మారుపేరైన ఈ పట్టణం పెన్షనర్స్ పేరడైజ్‌గా పేరొందింది. ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం రసాయనాల పెట్టుబడి ప్రాంతం కాకినాడను ఆనుకొని మొదలవుతుంది.
హోప్ ఐలాండ్
కాకినాడ తీర ప్రాంతం హోప్ఐలాండ్ ద్వారా రక్షణ పొందుతోంది. సముద్రపు ఆటుపోట్ల నుంచి తీరం కోతకు గురికాకుండా ఐదు వందల సంవత్సరాల నుంచి ఈ హోప్ ఐలాండ్ ఏర్పడింది. ఈ హోప్ ఐలాండ్ 23 కిలోమీటర్లు మేర విస్తరించి ఉంది. కాకినాడ సముద్రతీరంలో ఓడలు నిలిచినప్పుడు ఈ హోప్ ఐలాండ్ వల్ల ఓడలు లంగర్ వేసినప్పుడు స్థిరంగా ఉంటున్నాయి.
ఆధ్యాత్మిక నగరం
కాకినాడ ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతోంది. కాకినాడలో దేవాలయంవీధిలోని అతిపురాతన శివాలయం, బాలాత్రిపుర సుందరి ఆలయం ఉంది. ప్రవచన బ్రహ్మ చాగంటి కోటేశ్వరరావు, గరికిపాటి నరసింహారావు , సినీనటులు సూర్యకాంతం, రావుగోపాలరావుతోపాటు, ఎస్వీ రంగారావు, కవులు అద్దేపల్లి రామ్మోహనరావు, పుప్పాల సూర్యకుమారి, మాకినీడి సూర్యభాస్కర్ నగరానికి చెందినవారే.
నియోజకవర్గం: కాకినాడ సిటీ
ఏర్పడిన సంవత్సరం: 1952
నియోజకవర్గంలో డివిజన్లు: 43
పోలింగ్ స్టేషన్లు: 217
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: 112
విస్తీర్ణం: 31.39 చదరపు కిలోమీటర్లు
భౌగోళిక స్వరూపం (రెవెన్యూ డివిజన్ హద్దులు): నియోజకవర్గం చుట్టూ కాకినాడ రెవెన్యూ డివిజన్
హోదా: నగరపాలక సంస్థ
మున్సిపల్ స్కూల్స్: 66
ప్రైవేట్ స్కూల్స్: 200
ప్రభుత్వ కళాశాలలు: 7
ప్రైవేట్ కళాశాలలు: 26
మొత్తం జనాభా: 3,11,103
స్త్రీలు: 1,62,083
పురుషులు: 1,48,890
మొత్తం ఓటర్లు: 2,30,165
స్త్రీలు: 1,18,468
పురుషులు: 1,11,559
ఇతరులు: 138