స్మార్ట్ ఫోన్ ధరలు దిగిరానున్నాయ్!
న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ ధరలు రూ.2000 కంటే కిందకి దిగిరానున్నాయ్. డిజిటల్ సేవలు మరింత మంది ప్రజలకు చేరువవ్వాలంటే రెండు వేలకే స్మార్ట్ఫోన్ అందుబాటులోకి రావాల్సి ఉందని భారత్ పర్యటనకు వచ్చిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇచ్చిన సూచన మేరకు ప్రభుత్వం వెంటనే ఆ చర్యలకు సిద్దమైంది. స్మార్ట్ఫోన్ ధరలు కచ్చితంగా రూ.2,000 కంటే తక్కువగా ఉండేలా వినియోగదారుల ముందుకు రావాలని స్థానిక హ్యాండ్సెట్ తయారీదారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆర్థిక లావాదేవీలను మరింత మందికి అందించాలని అభిప్రాయపడుతోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటు ధరల్లో డివైజ్లు లభ్యం కానంత వరకు నగదు రహిత ఎకానమీని ప్రోత్సహించలేమని ప్రభుత్వం భావిస్తోంది.
ఇటీవల నీతి ఆయోగ్ నిర్వహించిన భేటీలో మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, లావా, కార్బన్ సంస్థలను తక్కువ ధరలకు స్మార్ట్ఫోన్లను తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తోంది. దీంతో డిజిటల్ లావాదేవీలను ప్రజలకు అందించవచ్చని పేర్కొనట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనీస్ స్మార్ట్ఫోన్ సంస్థలు, శాంసంగ్, ఆపిల్ లాంటి బహుళ జాతీయ దిగ్గజాలు ఈ మీటింగ్కు హాజరుకాలేదు. 20 నుంచి 25 మిలియన్ల స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చేలా హ్యాండ్సెట్ కంపెనీలు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించిందని, అయితే ఆ కంపెనీలకు సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వం తోసిపుచ్చినట్టు ఇద్దరు అధికారులు పేర్కొన్నారు.
ఫింగర్ ప్రింట్ స్కానర్, అత్యాధునిక ప్రాసెసర్, మంచి నైపుణ్యతతో తక్కువ ధరలకు ఫోన్లను తీసుకురావడం తమకు సవాళ్లేనని పరిశ్రమలోని వ్యక్తులు చెబుతున్నారు. ప్రస్తుతం 3జీ స్మార్ట్ఫోన్లు రూ.2500 మధ్యలో లభ్యమవుతున్నప్పటికీ, 4జీ ఫోన్లు కొంచెం ధరెక్కువగానే పలుకుతున్నాయి. పెద్ద నోట్ల రద్దయినప్పటి నుంచి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ ధరలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు ప్రారంభించింది.