శరవేగంగా ఎయిర్ పోర్టు అభివృద్ధి
సాక్షి, విజయవాడ : బందరు పోర్టు నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు తెప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. గన్నవరం ఎయిర్‌పోర్టును శరవేగంగా అభివృద్ధి చేసి అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ప్రతిపాదనలు, సర్వేలు పూర్తి చేసి త్వరితగతిన పంపాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి స్థానిక ఇరిగేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో సీఎం జిల్లా అభివృద్ధి, ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు.
అనంతరం విజయవాడ నగరాభివృద్ధి, గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధి, విజయవాడ-గుండుగొలను జాతీయ రహదారి నిర్మాణం, విజయవాడలోని కాలువల ఆధునికీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు సంబంధిత విభాగాల అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రానున్న 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గన్నవరం ఎయిర్‌పోర్టును సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, ప్రధానంగా అంతర్జాతీయ విమానాల రాకపోకల్ని పెంచేందుకు ఏ మేరకు చర్యలు తీసుకోవాలి.. ప్రయాణికుల సంఖ్య కూడా బాగా పెరగడానికి ఏంచేయాలి.. అనే అంశాలపై సమీక్షించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
సింగపూర్ తరహాలో కాలువలపై కూడా రన్‌వే నిర్మించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయో.. లేదో.. సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని చెప్పారు. విజయవాడలో కాలువల ఆధునికీకరణకు తొలి విడతగా రూ.11.6 కోట్లు విడుదలకు తక్షణమే అనుమతులిస్తానని ప్రకటించారు. ఎక్కడా లేనివిధంగా విజయవాడలో కాలువలు ఎక్కువగా ఉన్నాయనీ, వాటిని సుందరీకరించడం ద్వారా జలమార్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని, దీనిపై ప్రత్యేక సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
జలరవాణాకు తక్కువ ఖర్చు
కేంద్ర ప్రభుత్వంతో తాను జరిపిన చర్చల్లో జలమార్గాన్ని ప్రస్తావించానని సీఎం చెప్పారు. జలమార్గాన్ని అభివృద్ధి చేయడం ద్వారా బొగ్గు, ఖనిజ సంపద తక్కువ ఖర్చుతో రవాణా చేయడానికి వీలుందటుందనీ కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు. విజయవాడను మెట్రోపాలిటన్ సిటీగా అభివృద్ధి చేయడానికి అధికారులు కసరత్తు చేయాలని
ఆదేశించారు.
విజయవాడ-గుంటూరు మధ్య ఉన్న పట్టణాలను కలుపుతూ మెట్రోపాలిటన్ సిటీగా విజయవాడను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా ఫ్లై ఓవర్లను నిర్మించాలన్నారు. బెంజిసర్కిల్ నుంచి నాలుగు ఆధునిక ఫ్లైఓవర్లను నిర్మిస్తే ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటుందని చెప్పారు. దీని కోసం మంచి కన్ల్టెన్సీలను సంప్రదించాలని సూచించారు. అధికారులు ప్రజాప్రతినిధులు అందరి సలహాలను తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపకల్పన చేయాలన్నారు. విజయవాడను లాజిస్టిక్ హబ్‌గా తీర్చుదిద్దుతానని సీఎం చెప్పారు.
ఆర్కిటెక్చర్ విద్యార్థిని శ్రీవల్లి కాల్వల సుందరీకరణపై రూపొందించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను సీఎం తిలకించారు. అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్రావు, బొండా ఉమా, వల్లభనేని వంశీ, శ్రీరాం తాతయ్య, బోడే ప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హరికిరణ్, సీపీ శ్రీనివాస్, జేసీ జె.మురళి, ఎస్పీ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.