అనంతలోనే పాస్‌పోర్ట్ సేవలు
– శరవేగంగా సాగుతున్న పనులు
– అక్టోబర్ నెలలో ప్రారంభించనున్న తపాల శాఖ
అనంతపురం రూరల్ : పాస్‌పోర్ట్ కోసం విజయవాడ, వైజాగ్, తిరుపతి లాంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ఏ ఏ ధ్రువపత్రాలు తీసుకెళ్లాలో తెలియక రెండు మూడుసార్లు పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. పాస్ట్‌పోర్ట్ అవసరం ఉన్నా.. సుదూర ప్రాంతాలు వెళ్లలేక చాలా మంది పాస్‌పోర్ట్ తీసుకోకుండా ఉన్నవారి సంఖ్య జిల్లాలో అధికంగానే ఉంది. ఇక పై ఈ బాధలన్నీ తీరనున్నాయి.
అనంతలోనే పాస్‌పోర్ట్ కార్యాలయం:
పాస్‌పోర్ట్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా అనంతలోనే పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు అనంతపురంలోని ప్రధాన తపాల కార్యాలయ ఆవరణంలో పాస్‌పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు తపాల శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. తపాల కార్యాలయంలోని మూడవ అంతస్తులో దీనికి సంబంధించిన పనులు సైతం శరవేగంగా కొనసాగుతున్నాయి. పాస్‌పోర్ట్ సేవలు తపాలశాఖ ఆధ్వర్యంలో అందనున్నాయి.
ఇక్కడికి రావడం శుభ పరిణామం
- సునీల్‌కుమార్, ఎంబీఏ విద్యార్థి, అనంతపురం
పాస్‌పోర్ట్‌కు ఇతర ప్రాంతాలు వెళ్లనవసరం లేకుండా జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయడం శుభపరిమాణం. పాస్‌పోర్ట్‌కు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే అదనపు ఖర్చుతో కూడిన పని ఇక్కడే పాస్‌పోర్ట్ కార్యాలయం నెలకొల్పనుండటంతో కష్టాలు తీరనున్నాయి.
అక్టోబర్ నెలలో ప్రారంభిస్తాం
- చంద్రశేఖర్, సూపరింటెండెంట్, అనంతపురం
జిల్లా ప్రజలకు పాస్‌పోర్ట్ సేవలు త్వరతగతిన తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టాం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రధాన తపాల కార్యాలయం నెలకొల్పుతున్నాం. అక్టోబర్ నెలలో అందుబాటులోకి తీసుకొస్తాం.