యాదవులను కించపరిస్తే ఊరుకోం
- బేషరతుగా క్షమాపణ చెప్పాలి
- టీడీపీ అధినేత చంద్రబాబును డిమాండ్ చేసిన యాదవులు
- జాతీయ రహదారిపై గొర్రెలతో నిరసన
తూప్రాన్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గొర్రె కాపరుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ యాదవులు మండిపడుతున్నారు. తూప్రాన్ మండలం మనోహరాబాద్ వద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం యాదవులు గొర్రెలు, మేకలతో తరలివచ్చి రహదారిపై బైఠాయించారు. స్థానిక సర్పంచ్ సందా సంతోష సోముల్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో యాదవ మహాసభ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు గండి మల్లేశ్ యాదవ్ మాట్లాడుతూ యాదవుల ఓట్లతో అధికారం దక్కించుకున్న చంద్రబాబు ఇప్పుడు తమ పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడడం దారుణమన్నారు. చంద్రబాబుకు మతిభ్రమించడం వల్లే యాదవుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో బేషరుతుగా క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలోనే కాదు ఆంధ్రాలోనూ తమ కులస్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసనలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి, జిల్లా యువత అధ్యక్షుడు బురం గణేశ్ యాదవ్, సర్పంచ్‌లు శ్రీశైలం యాదవ్, మల్లేశ్ యాదవ్, నాయకుడు తుమ్మల రాజు తదితరులు పాల్గొన్నారు. వీరి ఆందోళనకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ర్యాకల శేఖర్‌గౌడ్ సంఘీభావం తెలిపారు.