పట్టాలు రక్తసిక్తం
సాక్షి ముంబై: ఈసారి దీపావళి ముంబైలోని చాలా చోట్ల విషాదం నింపింది. లోకల్ రైళ్ల ప్రమాదాల్లో అనేక మంది మృత్యువాతపడ్డారు. నాలుగు రోజుల్లో వేర్వేరు చోట్ల జరిగిన రైలు ప్రమాదాల్లో సుమారు 54 మంది మరణించారు. 36 మంది గాయాలుపాలయ్యారని రైల్వే పోలీసు వర్గాలు తెలిపాయి. నవంబర్ ఒకటి నుంచే నగరంలో దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చాలా మందికి సెలవులు వచ్చాయి. మరికొందరు సగం రోజు (హాఫ్‌డే) పనిచేసి ఇంటికెళ్లాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అనేక మంది షాపింగ్, బంధువులను కలవడానికి, సరదా కోసం లోకల్‌రైళ్లలో ప్రయాణాలు సాగించారు.
ఈ నేపథ్యంలో నవంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు జరిగిన వివిధ ప్రమాదాల్లో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 36 మంది గాయపడ్డారు. ముఖ్యంగా లక్ష్మీపూజ జరిగిన నవంబర్ ఐదు రోజున ఏకంగా 19 మంది మృతి చెందారు. వీరిలో సీఎస్టీ స్టేషన్లో ఒకరు, కుర్లాలో ముగ్గురు, ఠాణేలో ఒకరు, కళ్యాణ్‌లో ఐదుగురు, డోంబివలిలో ఒకరు, కర్జత్‌లో ఇద్దరు, చర్చ్‌గేట్‌లో ఇద్దరు, బోరివలిలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఆరుగురు గాయపడ్డారు. ఈ నెల ఒకటిన తొమ్మిది మంది మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. రెండున జరిగిన ప్రమాదాల్లో 13 మంది మృతి చెందగా, 12 మంది గాయాలుపాలయ్యారు. నాలుగున సంభవించిన వివిధ ప్రమాదాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది మంది గాయపడ్డారు. కళ్యాణ్ స్టేషన్లో జరిగిన ప్రమాదాల్లో గ్యాంగ్మెన్లు కూడా మరణించడం తెలిసిందే.
కళ్యాణ్-కసారా మార్గంలో ఆరుగురి మృతి..
కళ్యాణ్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఆసన్‌గావ్ స్టేషన్లో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, షహాడ్లో పట్టాలు దాడుతుండగా రైలు ఢీకొని మరొకరు మరణించారు. కళ్యాణ్ స్టేషన్లో నలుగురు గ్యాంగ్మెన్లు వేర్వేరు ప్రమాదాల్లో మృత్యువాతపడ్డారు.