localization
-
లోకలైజేషన్ పెరగాలి
న్యూఢిల్లీ: వాహన విడిభాగాల పరిశ్రమ స్థానికీకరణ (లోకలైజేషన్) పెంచడంపై మరింతగా దృష్టి పెట్టాలని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కెనిచి అయుకావా అభిప్రాయపడ్డారు. నిలకడైన వృద్ధి సాధించేందుకు కొత్త టెక్నాలజీలపై పెట్టుబడులు పెంచడాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు. ఆటో విడిభాగాల సంస్థల సమాఖ్య ఏసీఎంఏ 62వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా అయుకావా ఈ విషయాలు తెలిపారు. ‘ముడి వస్తువులు మొదలుకుని అత్యంత చిన్న విడిభాగాలను కూడా వీలైనంత వరకూ స్థానికంగానే ఉత్పత్తి చేసేందుకు మార్గాలు వెతకాలి. భారతీయ ఆటో పరిశ్రమ దేశీయంగాను, అటు ఎగుమతులపరంగానూ భారీ స్థాయికి పెరిగింది. ఇలాంటప్పుడు నాణ్యత అత్యంత ప్రాధాన్యమైన అంశంగా ఉంటుంది. కాబట్టి నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాలి’ అని పేర్కొన్నారు. 2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించాలన్న ప్రధాని లక్ష్యం సాకారం చేసే దిశగా భవిష్యత్ తరం టెక్నాలజీలపై పరిశ్రమ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. పరిశ్రమను తిరిగి వృద్ధి బాట పట్టించేందుకు ఏసీఎంఏ, వాహనాల తయారీ సంస్థల సమాఖ్య సియామ్ కలిసి పనిచేయాలని అయుకావా తెలిపా రు. కాగా, ప్యాసింజర్, వాణిజ్య వాహనాల అమ్మకాలు కరోనా పూర్వ స్థాయికి చేరగా.. ద్విచక్ర వాహనాల విక్రయాలు కూడా ఈ పండుగ సీజన్లో ఆ స్థాయిని అందుకోగలవని అంచనా వేస్తున్నట్లు ఏసీఎంఏ ప్రెసిడెంట్ సంజయ్ కపూర్ చెప్పారు. వాహనాల పరీక్షకు కఠిన ప్రమాణాలు ఉండాలి: పవన్ గోయెంకా ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీలు ఆదరాబాదరాగా మార్కెట్లోకి తెచ్చేయకుండా తయారీకి సంబంధించి కఠిన ప్రమాణాలు, పరీక్షలు ఉండాలని ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ చైర్మన్ పవన్ గోయెంకా అభిప్రాయపడ్డారు. తద్వారా విద్యుత్ వాహనాలు అగ్ని ప్రమాదాల బారిన పడే ఉదంతాలను నివారించవచ్చని పేర్కొన్నారు. కఠిన చర్యలు.. సరఫరాదారులు విడిభాగాలను స్థానికంగా తయారు చేయకుండా అడ్డుపడే ఆటోమొబైల్ కంపెనీల విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తుంది. దేశీయంగానే విడిభాగాలను తయారు చేసుకోవడానికి పరిశ్రమ ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నాం. – పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి -
శింగనమల ప్రజల 60 ఏళ్ళ ఆకాంక్ష నెరవేరిన వేళ
-
దేశీ విడిభాగాలకే ప్రాధాన్యమివ్వాలి
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ తయారీ సంస్థలు దేశీయంగా తయారైన విడిభాగాల తయారీ, కొనుగోళ్లకు మరింతగా ప్రాధాన్యమివ్వాలని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఆటో విడిభాగాల దిగుమతులను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం 70 శాతంగా ఉన్న విడిభాగాల లోకలైజేషన్‌ను .. 100 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. లేని పక్షంలో దిగుమతి చేసుకునే విడిభాగాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని వ్యాఖ్యానించారు. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ‘వాహనాలు, ఆటో విడిభాగాల తయారీదారులు స్థానిక పరికరాల కొనుగోళ్లను గరిష్ట స్థాయిలో.. 100 శాతం దాకా పెంచుకోవాలని కోరుతున్నా. ఇలాంటివన్నీ తయారు చేసేందుకు అవసరమైన సామర్థ్యాలు మనకు పుష్కలంగా ఉన్నాయి. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా నినాదానికి దేశీ ఆటో పరిశ్రమ మద్దతుగా నిలిచేందుకు ఇదే సరైన తరుణం‘ అని ఆయన పేర్కొన్నారు. సెమీకండక్టర్ల తయారీకి తోడ్పాటు కావాలి.. ఎలక్ట్రానిక్ విడిభాగాలు .. ముఖ్యంగా సెమీకండక్టర్లను స్థానికంగా తయారు చేసేందుకు ప్రభుత్వం కూడా తోడ్పాటు అందించాలని భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సొసైటీ సియామ్ ప్రెసిడెంట్ కెనిచి అయుకావా కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమ రెండంకెల వృద్ధి సాధించగలని అంచనా వేస్తున్నట్లు ఏసీఎంఏ ప్రెసిడెంట్ దీపక్ జైన్ తెలిపారు. -
ఇవేం నిబంధనలు!!
న్యూఢిల్లీ: భారత్ ప్రతిపాదిత డేటా లోకలైజేషన్ నిబంధనలు, ఈ–కామర్స్ విధాన ముసాయిదాలోని ప్రతిపాదనలను అమెరికా ఆక్షేపించింది. ఇవి అత్యంత వివక్షాపూరితంగాను, వాణిజ్యాన్ని దెబ్బతీసేవిగాను ఉన్నాయని వ్యాఖ్యానించింది. 2019లో విదేశీ వాణిజ్యానికి ప్రతిబంధకాలు అంశంపై అమెరికా వాణిజ్య విభాగం (యూఎస్టీఆర్) రూపొందించిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. ‘భారత్ ఇటీవలే డేటాను స్థానికంగా భద్రపర్చాలని (లోకలైజేషన్) నిబంధనలను ప్రతిపాదించింది. ఇలాంటి వాటివల్ల డేటా ఆధారిత సేవలు అందించే సంస్థలు అనవసరంగా, వృథాగా డేటా సెంటర్లను ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అంతర్జాతీయంగా మెరుగైన సేవల ప్రయోజనాలను స్థానిక సంస్థలు పొందనీయకుండా చేస్తుంది. సీమాంతర డేటా వినియోగంపై ఆంక్షలు విధించడం వివక్ష చూపడమే అవుతుంది. ఇవి అమెరికా, భారత్ మధ్య డిజిటల్ వాణిజ్యానికి తీవ్ర ప్రతిబంధకాలుగా మారే అవకాశం ఉంది. ఈ–కామర్స్ విధానం ముసాయిదాలో ఇలాంటి విచక్షణాపూరిత, వాణిజ్యాన్ని దెబ్బతీసే నిబంధనలను భారత్ పునఃసమీక్షించాలని అమెరికా భావిస్తోంది‘ అని నివేదిక పేర్కొంది. చెల్లింపుల సమాచారం అంతా భారత్‌లోనే స్థానికంగా భద్రపర్చాలన్న నిబంధన వల్ల పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ వ్యయాలు పెరిగిపోతాయని, అంతర్జాతీయంగా సేకరించిన డేటాను ఒకే దగ్గర భద్రపర్చుకుని, వినియోగించుకునే విదేశీ సంస్థలపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని నివేదిక తెలిపింది. దేశీయంగా డేటా, ఇన్ఫ్రా అభివృద్ధి, ఈ–కామర్స్ మార్కెట్‌ప్లేస్, నియంత్రణపరమైన సవాళ్ల పరిష్కారం, దేశీ డిజిటల్ ఎకానమీకి ఊతమివ్వడం తదితర అంశాల ప్రాతిపదికగా ప్రభుత్వం ప్రత్యేక ఈ–కామర్స్ విధానం ముసాయిదా రూపొందించిన సంగతి తెలిసిందే. దీనిపైనే అమెరికా తాజాగా స్పందించింది. భారత్‌లో భారీ టారిఫ్‌లు.. ఇక భారత వాణిజ్య విధానాలపై కూడా నివేదికలో అమెరికా విమర్శలు గుప్పించింది. పలు అమెరికా ఉత్పత్తులపై భారత్ అత్యంత భారీగా సుంకాలు విధిస్తోందని పేర్కొంది. పూలపై 60 శాతం, రబ్బర్‌పై 70 శాతం, ఆటోమొబైల్స్‌పై 60 శాతం, మోటార్‌సైకిల్స్‌పై 50 శాతం, కాఫీ మొదలైనవాటిపై 100 శాతం, ఆల్కహాలిక్ బెవరేజెస్‌పై 150 శాతం దిగుమతి సుంకాలు విధిస్తోందని పేర్కొంది. అంతేగాకుండా వాణిజ్యానికి అవరోధాలు కల్పించేలా కొన్ని వైద్యపరికరాల ధరలను నియంత్రించడం, ఇథనాల్ దిగుమతులపై ఆంక్షలు విధించడం వంటివి కూడా చేస్తోందని ఆరోపించింది. ఈ–కామర్స్ ముసాయిదాతో డిజిటల్ లక్ష్యాలకు విఘాతం ఐఏఎంఏఐ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో 2022 నాటికల్లా 1 లక్ష కోట్ల డాలర్ల డిజిటల్ ఎకానమీగా భారత్‌ను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి విఘాతం కలిగించేదిగా ఈ–కామర్స్ విధాన ముసాయిదా ఉందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వ్యాఖ్యానించింది. దీనివల్ల ఈ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. డేటా, ఇన్ఫ్రా అభివృద్ధి, ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్, నియంత్రణ నిబంధనలపరమైన సవాళ్లు, దేశీ డిజిటల్ ఎకానమీ వృద్ధికి తీసుకోదగిన చర్యలు మొదలైన వాటికి సంబంధించి రూపొందించిన జాతీయ ఈ–కామర్స్ విధాన ముసాయిదాపై పరిశ్రమవర్గాల స్పందన కోరిన మీదట ఐఏఎంఏఐ తాజా అభిప్రాయాలు వ్యక్తం చేసింది. ‘డేటా లోకలైజేషన్ తప్పనిసరి చేయడం, ఈ–కామర్స్ పరిధిలోకి డిజిటల్ అడ్వర్టైజింగ్.. ఆన్లైన్ స్ట్రీమింగ్ మొదలైనవన్నీ చేర్చడం, డిజిటల్ సేవల్లోకి విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు విధించే అవకాశాలు మొదలైనవాటి వల్ల ఈ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. 1 లక్ష కోట్ల డాలర్ల డిజిటల్ ఎకానమీని నిర్మించాలంటే ఇవే చాలా కీలకం‘ అని పేర్కొంది. -
హోండా బహుముఖ వ్యూహం
⇒ హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ ⇒ కొత్త మోడల్స్ విడుదల; ఉత్పత్తి పెంపుపై దృష్టి... లోకలైజేషన్‌కు ప్రాధాన్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :డిమాండ్‌కి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త మోడల్స్, నెట్వర్క్ విస్తరణతో కొనుగోలుదారులకు మరింత చేరువవుతున్నామంటున్నారు ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) జ్ఞానేశ్వర్ సేన్. లోకలైజేషన్‌పై దృష్టి సారించడం ద్వారా నాణ్యమైన కార్లను తక్కువ ధరకు అందించే ప్రయత్నం చేస్తున్నామంటూ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు సేన్. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. భారీ మార్కెట్... సుమారు 120 కోట్ల మంది పైగా జనాభా గల మన దేశంలో ప్రస్తుతం కార్ల మార్కెట్ కేవలం ముప్పై లక్షల మేర ఉంటోంది. సంపన్న దేశాల్లో వెయ్యి మందికి ఆరేడు వందలు, పొరుగు దేశాల్లో దాదాపు వంద కార్లుగాను నిష్పత్తి ఉంటే.. మన దగ్గర ఇది ఇరవై కార్ల కన్నా తక్కువగానే ఉంది. కొనుగోలుదారుల అభిరుచుల్లో మార్పులకు అనుగుణంగా ఈ మార్కెట్ క్రమంగా పెరుగుతోంది. అదే అంచనాలతో మేమూ మా ఉత్పత్తి సామర్ధ్యాలను పెంచుకుంటున్నాం. ఎప్పటికప్పుడు కొంగొత్త మోడల్స్‌ను ప్రవేశపెడుతున్నాం. ప్రస్తుతం ఏడు మోడల్స్ విక్రయిస్తున్నాం. సీఆర్-వీ సహా ఇవన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తున్నవే. దిగుమతి చేయడం లేదు. తదుపరి వృద్ధిని అందుకునే దిశగా మేము సన్నద్ధమవుతున్నాం. ఏప్రిల్, మేలో అమ్మకాలు కాస్త మందగించాయి. ప్రధానంగా డీజిల్, పెట్రోల్ కార్ల విషయంలో కొనుగోలుదారుల అభిరుచులు మారడం, డిమాండ్-సరఫరాకి మధ్య వ్యత్యాసాలు మొదలైనవి ఇందుకు కారణం. మరికొద్ది కాలంలో ఇది సర్దుకోవచ్చు. విక్రయాల వృద్ధికి వ్యూహాలు.. కొనుగోలుదారులకు మరింత చేరువయ్యే దిశగా కొత్త మోడల్స్ ప్రవేశపెట్టడం, స్థానికంగా తయారీకి ప్రాధాన్యం ఇవ్వడం, ఉత్పత్తి పెంచుకోవడం తదితర వ్యూహాలను అమలు చేస్తున్నాం. ప్రస్తుతం 190 నగరాల్లో సుమారు 298 డీలర్‌షిప్‌లు ఉన్నాయి. వీటిని ఈ ఆర్థిక సంవత్సరం 340కి పెంచుకోనున్నాం. కార్ల మార్కెట్లో దాదాపు మూడో వంతు రీప్లేస్మెంట్దే ఉంటున్న నేపథ్యంలో పాత కార్ల ఎక్స్చేంజీ ఆఫర్లు కూడా ఇస్తున్నాం. అలాగే లోకలైజేషన్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. మా వాహనాల్లో గరిష్టంగా భారత్‌లో తయారైన విడిభాగాలే ఉపయోగిస్తున్నాం. ఉదాహరణకు ఇటీవలే ప్రవేశపెట్టిన బీఆర్-వీనే తీసుకుంటే.. ఇది 94 శాతం భాగం దేశీయంగానే తయారైనది. దీనికి సుమారు నెల రోజుల వ్యవధిలో దాదాపు తొమ్మిది వేల పైచిలుకు ఆర్డర్లు వచ్చాయి. ఇక, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి ఎక్కువగా స్థానీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దిగుమతి వ్యయాలు తగ్గడం వల్ల తక్కువ ధరల రూపంలో ఆ ప్రయోజనాలను కొనుగోలుదారులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఉత్పత్తికి సంబంధించి రాజస్తాన్‌లోని టపుకరాలో 1.2 లక్షల వార్షిక సామర్థ్యం గల ప్లాంటు ఉంది. అక్కడ సామర్థ్యాన్ని 1.8 లక్షలకు పెంచుకునే దిశగా రూ. 380 కోట్లు ఇన్వెస్ట్ చేశాం. గ్రేటర్ నోయిడాలోని మరో ప్లాంటుతో కూడా కలుపుకుంటే విస్తరణతో మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2.4 లక్షల నుంచి 3 లక్షలకు పెరుగుతుంది. కొత్త సెగ్మెంట్లలోకి.. మేం వివిధ విభాగాల్లో కాస్త ఆలస్యంగానే ప్రవేశించినప్పటికీ.. నాణ్యతే ప్రధానంగా ముందుకెడుతున్నాం. గత మూడేళ్లుగా ఎంట్రీ లెవెల్ సెడాన్, ఎంపీవీ, కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ వాహనాలను అందుబాటులోకి తెచ్చాం. ఇవన్నీ మా అమ్మకాల వృద్ధికి దోహదపడ్డాయి. ఈ ఏడాది హోండా అకార్డ్ (హైబ్రీడ్) సెప్టెంబర్‌లో ప్రవేశపెడుతున్నాం. దీన్ని మాత్రం దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తాం. హైబ్రీడ్ కార్ల మార్కెట్ చిన్నగానే ఉన్నప్పటికీ.. పర్యావరణంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ఇది మెరుగుపడవచ్చు. విధానాల్లో స్పష్టత కొరవడింది... సవాళ్ల విషయానికొస్తే.. విధానాల్లో స్పష్టత లేకపోవడం సమస్యలకు దారితీస్తోంది. పరిశ్రమల శాఖ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు దీని ప్రభావాల గురించి వివరించింది. ప్రస్తుతానికైతే ఢిల్లీలోనే ఇది అమలవుతోంది. డీజిల్ వాహనాలపై ఆంక్షలు కొనుగోలుదారుల్లో ఆలోచనల్లో కొంత అనిశ్చితికి దారి తీశాయి.. ఇది మాకూ కొంత సమస్యాత్మకంగా మారింది. కొనుగోలుదారులు డీజిల్ నుంచి పెట్రోల్ కార్లవైపు మళ్లుతుండటంతో దానికి తగ్గట్లుగా ఉత్పత్తినీ సర్దుబాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాం. దక్షిణాది మార్కెట్.. రయ్ రయ్ ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది మార్కెట్ చాలా వేగంగా పరుగులు తీస్తోంది. అయిదేళ్ల క్రితం ఉత్తరాది ముందువరుసలో ఉంటే, పశ్చిమ, దక్షిణాది రీజియన్లు వరుసగా రెండు, మూడో స్థానంలో ఉండేవి. కానీ ప్రస్తుతం మూడూ దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. బహుశా మరో ఒకట్రెండు సంవత్సరాల్లో దక్షిణాది జోన్ ముందుకు వచ్చేయొచ్చు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. కరీంనగర్, వరంగల్ మొదలుకుని ఏపీలో వైజాగ్, విజయవాడ, నెల్లూరు తదితర ప్రాంతాల్లో మా డీలర్‌షిప్‌లు ఉన్నాయి. కొత్తగా నల్లగొండలో ప్రారంభిస్తున్నాం.