ఘాటెక్కిన పచ్చిమిర్చి
- మార్కెట్లో రిటైల్‌గా కిలో రూ.60
- నగరానికి తగ్గిన సరఫరా
- కూరగాయల ధరలు పైపైకి
సాక్షి, సిటీబ్యూరో : నగర మార్కెట్లో పచ్చిమిర్చి ధర వీర విహారం చేస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే రూ.20 మేర ధర పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో పచ్చిమిర్చి ధర కేజీ రూ.60కి చేరింది. ఇదే సరుకు హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.40 ఉండగా, రైతుబజార్లో మాత్రం రూ.43కు విక్రయిస్తున్నారు. కేజీ ధర చెబితే కొనరన్న ఉద్దేశంతో వ్యాపారులు పావు కిలో రూ.15 చెప్పి అమ్ముతున్నారు.
మే నెలాఖరు వరకు కేజీ రూ.23 లభించిన మిర్చి ఇప్పుడు ఏకంగా రూ.60కి ఎగబాకింది. స్థానికంగా మిర్చి దిగుబడి పూర్తిగా పడిపోవడంతో ఇతర రాష్ట్రాల దిగుమతులపైనే ఆధారపడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, అనంతపూర్ జిల్లాల నుంచి నగరానికి మిర్చి దిగుమతి అవుతోంది. అయితే... ఇటీవల అక్కడ వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో హైదరాబాద్‌కు సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా డిమాండ్- సరఫరాల మధ్య అంతరం పెరగడంతో వ్యాపారులు ఒక్కసారిగా మిర్చి ధర పెంచేశారు. వారం రోజుల క్రితం ధరలతో ప్రస్తుత ధరను పోల్చి చూస్తే రూ.20మేర పెరుగుదల కన్పిస్తోంది.
అన్ని వర్గాల వారు నిత్యం వినియోగించే మిర్చి ధరకు రెక్కలు రావడంతో ఈ ప్రభావం ఇతర కూరగాయలపైనా పడింది. మొన్నటివరకు కేజీ రూ.30 పలికిన టమోటా ఇప్పుడు రూ.40కి చేరింది. అలాగే దొండ, దోస, బీర, కాకర, తదితర రకాల ధరలు కూడా రూ.2-8 వరకు పైకి ఎగబాకాయి. ఇక క్యారెట్, చిక్కుడు, ఫ్రెంచ్ బీన్స్ ధరలైతే సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. కేజీ రూ.60-80 ధర పలుకుతుండటంతో వాటివైపు చూసేందుకు కూడా వారు సాహసించలేక పోతున్నారు.
తగ్గిన సరఫరా : నగర అవసరాలకు నిత్యం 200-250 టన్నుల మిర్చి దిగుమతి అయ్యేది. అయితే... ఇప్పుడు 100-130 టన్నులకు మించి సరుకు దిగుమతి కావ ట్లేదని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే టమోటా కూడా రోజుకు 600 టన్నులు అవసరం ఉండగా ప్రస్తుతం 400 టన్నులు మాత్రమే దిగుమతవుతోంది. కర్నూలు, అనంతపూర్, గుంటూరు, ప్రాంతాల్లో మిర్చికి... మదనపల్లి, బెంగళూరుల్లో టమోటాకు డిమాండ్ అధికంగా ఉండటంతో నగర అవసరాలకు తగినంత సరుకు సరఫరా కావట్లేదని తెలుస్తోంది.
సరఫరా తగ్గడమే ధరలు పెరగడానికి కారణమని వ్యాపారులు నమ్మబలుకుతున్నారు. అన్ని వర్గాలవారు నిత్యం కూరల్లో వినియోగించే టమోట, మిర్చి ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులను కలవరపెడుతోంది. అయితే... టమోట, మిచ్చి, ఉల్లి ధరలు అదుపుతప్పకుండా చూసేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు రంగంలోకి ‘మన కూరగాయల’ స్కీం కింద నగరంలో 50 ఔట్‌లెట్స్‌ను ఏర్పాటు చేసి టమోట, ఉల్లిని హోల్‌సేల్ ధరకే విక్రయిస్తున్నారు. కానీ ఇవి నగరమంతటా లేకపోవడంతో వినియోగదారులందరికీ అందని పరిస్థితి ఎదురైంది.