తాగునీటి గోసకు గోదావరి గుళిక
గజ్వేల్: గజ్వేల్ నగర పంచాయతీ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే గోదావరి జలాలను పథకాన్ని రూపొందిస్తున్నారు. రూ.70.52 కోట్లతో ఇప్పటికే అంచనాలు సిద్ధం చేశారు. ఎన్సీపీఈ (నేషనల్ కన్సల్టెన్సీ ఫర్ ప్లానింగ్ అండ్ ఇంజనీరింగ్) ఆధ్వర్యంలో తయారు చేసిన ఈ ప్రతిపాదనలను స్థానిక నగర పంచాయతీ అధికారులు ప్రజారోగ్య శాఖ సీఈ (చీఫ్ ఇంజినీర్) పరిశీలనకు పంపారు. కొద్దిరోజుల్లోనే ఈ ప్రతిపాదనలు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆమోదానికి వెళ్లనున్నాయి.
సీఎం ఆదేశాలతో అంచనాలు సిద్ధం
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ పరిధిలో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు అధికారులు తొలుత సింగూర్ నుంచి పైప్‌లైన్ ద్వారా ఇక్కడికి నీటిని తీసుకురావాలని భావించారు. ఇందుకోసం రూ.150 నుంచి రూ. 200 కోట్లు అవసరమవుతుందని అంచనా వేశారు. అయితే సింగూర్ నుంచి పైప్‌లైన్ ద్వారా నీరు తేవడం వ్యయభారమే కాకుండా, ఈ పథకాన్ని నిరంతరంగా నడపటానికి కోట్ల రూపాయల కరెంట్ బిల్లులను భరించాల్సి వస్తుందని అధికారులు గుర్తించారు.
దీంతో సింగూర్‌కు నీటికి ప్రత్యామ్నాయంగా ఈ ప్రాంతంనుంచి జంట నగరవాసుల దాహార్తిని తీర్చడానికి పైప్‌లైన్ ద్వారా పరుగులు పెట్టడానికి సిద్ధమవుతున్న ‘గోదావరి సుజల స్రవంతి’ పథకాన్ని ట్యాప్ చేస్తే సమస్య పరిష్కారమవుతుందని ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్లడం...ఫలితంగా సీఎం నుంచి ఆదేశాలు వెలువడటంతో పథకానికి అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. నిత్యం 40 లక్షల లీటర్ల నీటిని నగర పంచాయతీకి ఈ పైప్‌లైన్ ద్వారా తీసుకురానున్నారు.
తొలుత షామీర్పేట ప్రాంతంలో గోదావరి సుజల స్రవంతి పైప్‌లైన్‌ను ట్యాప్ చేయాలని భావించారు. కానీ తిరిగి నగర పంచాయతీ పరిధిలోని లింగారెడ్డిపేట వద్ద ఉన్న పైప్‌లైన్‌ను ట్యాప్ చేస్తే సరిపోతుందనే నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం లింగారెడ్డిపేట పైప్‌లైన్ ట్యాపింగ్‌తోపాటు నగర పంచాయతీలోని నాలుగుచోట్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం, పైప్‌లైన్ విస్తరణ, భూములు సేకరణ తదితర పనుల కోసం రూ.70.52 కోట్లతో అంచనాలు రూపొందించారు.
ఈ ప్రతిపాదనలను కొన్ని రోజుల కిందట ప్రజారోగ్య శాఖ సీఈ పరిశీలనకు పంపారు. పరిశీలన పూర్తికాగానే కేంద్రపట్టణాభివృద్ధి శాఖ ఆమోదానికి పంపి నిధులు రాబట్టనున్నారు. ఈ విషయాన్ని స్థానిక నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, కమిషనర్ సంతోష్‌కుమార్‌లు ధృవీకరించారు.