నగర పంచాయతీలో ఖరారు కాని కాంగ్రెస్, టీడీపీల అభ్యర్థులు
మధిర, న్యూస్‌లైన్: నగర పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేయడం కాంగ్రెస్, టీడీపీలకు తలకుమించిన భారంగా పరిణమించింది. పలానా వ్యక్తి తమపార్టీ అభ్యర్థి అని తేల్చితే మిగిలినవారు ఎక్కడ అలకబూనుతారో...అది ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందో తెలియక తలబట్టుకుంటున్నారు. నగర పంచాయతీ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. వార్డు కౌన్సిలర్లలో ఎవరు తమ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థో తేల్చడంలోనూ ఈరెండు పార్టీల్లో సందిగ్ధతే ఉంది.
ఈ రెండు పార్టీల్లో ముఖ్య నాయకులుగా చెలామణి అవుతున్న వారు పోటీచేసే అవకాశం వచ్చినా వెనుకడుగు వేయడంతో అభ్యర్థులను తేల్చడం ఒకింత ఇబ్బందికరంగా మారిందని ఇరు పార్టీల నేతలు కొందరు చెబుతున్నారు. తొలిసారి నగర పంచాయతీగా ఆవిర్భవించిన మధిర తొలి చైర్పర్సన్ పదవి దక్కించుకోవాలని ఈ రెండు పార్టీలు పావులు కదుపుతున్నా...వైఎస్ఆర్సీపీ, సీపీఎం కూటమియే తమ ఆధిపత్యాన్ని చాటుతూ స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్తుండటం కాంగ్రెస్, టీడీపీలకు కంటగింపుగా మారింది. చైర్పర్స న్ పదవి దక్కించుకునేందుకు కాంగ్రెస్, సీపీఐలు జట్టుకట్టి నా.. అభ్యర్థి ఎంపిక లో మాత్రం ఇవి సత్ఫలితాల దిశగా సాగటంలేదని విశ్లేషకులు అంటున్నారు.
స్పష్టతతో ముందుకెళ్తున్న వైఎస్ఆర్సీపీ, సీపీఎం
వైఎస్ఆర్సీపీ, సీపీఎం స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్తున్నాయి. నగరపంచాయతీలో మొత్తం 20 వార్డులుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ 11, సీపీఎం తొమ్మిది వార్డుల్లో పోటీచేస్తున్నాయి. కాంగ్రెస్ మూడు వార్డులను సీపీఐ కేటాయించి, మిగిలిన 17 వార్డుల్లో పోటీ చేస్తోంది. నగర పంచాయతీలో 5, 6, 7, 11, 18 వార్డులను ఎస్సీ(జనరల్)కు రిజర్వ్ చేశారు. దీనిలో 6, 7 వార్డులు ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు. ఆరు, ఏడు వార్డుల్లో గెలిచిన అభ్యర్థులే చైర్పర్సన్ అయ్యే అవకాశాలుండటంతో ఈ వార్డుల్లో పోటీ రసవత్తరంగా ఉంది. ముఖ్యంగా 18వ వార్డులో అత్యధికంగా 13 మంది అభ్యర్థినులు పోటీలో ఉన్నారు.
ఒకరికి బీఫాం వస్తే మరొకరు అలకపూనే అవకాశం ఉండటంతో ప్రధాన పోటీదారులు తలలు పట్టుకుంటున్నారు. అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఆయా పార్టీల ముఖ్య నేతలు ఉన్నారు. ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క నివాసం ఉండే రెండోవార్డులోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో స్పష్టతలేదు. 14వ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీకి ఎవరూ ముందుకు రాకపోవడంతో టీడీపీకి చెందిన శ్రీదేవి నామినేషన్ దాఖలు చేశారు.
అత్యధికంగా నామినేషన్లు దాఖలైన 18వ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున ఎవరిని అభ్యర్థినిగా ప్రకటిస్తారోనని ఆ పార్టీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. భట్టి విక్రమార్క స్థానికంగా లేకపోవడం వల్లే ఆ పార్టీ అభ్యర్థుల ఎంపిక ఇంతవరకు ఓ కొలిక్కి రాలేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
గందరగోళంలో టీడీపీ
నేటితో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగుస్తున్నా తెలుగుదేశం పార్టీలో స్పష్టత కొరవడింది. 9, 11 వార్డుల్లో ఆపార్టీ అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు వేయకపోవడం గమనార్హం. 19, 20 వార్డుల్లో అభ్యర్థులు లేక ఇతర పార్టీల నుంచి రాత్రికిరాత్రే జెండాలు మార్చిన వారికి టీడీపీ టికెట్లు ఇచ్చింది. ఆ పార్టీలో వర్గపోరుతో చైర్పర్సన్ అభ్యర్థినిగా ప్రచారంలోకి వచ్చిన మాజీ ఎంపీపీ యర్రగుంట లక్ష్మి వార్డు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
14వ వార్డును జనరల్‌కు కేటాయించడంతో ఆ వార్డు నుంచి ప్రాతినిధ్యం కోసం ఆమె ప్రయత్నించారు. అయితే పార్టీలోని మరో వర్గం దీన్ని వ్యతిరేకించింది. ఐదు, ఆరు వార్డుల్లో పోటీచేద్దామని ప్రయత్నించినా ఇక్కడా వర్గపోరే వెంటాడింది. చివరికి టీడీపీకి అంతగా బలంలేని 18వ వార్డు నుంచి లక్ష్మి పోటీ చేస్తున్నారు. మొత్తంమీద మధిర నగరపంచాయతీ ఎన్నికలు టీడీపీ వర్గపోరును, కాంగ్రెస్‌లో ఉన్న అస్పష్టతను బయటపెట్టాయని విశ్లేషకులు అంటున్నారు.
మధిర నగర పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడంలో కాంగ్రెస్, టీడీపీలు కొట్టుమిట్టాడుతున్నాయి. తమ పార్టీ అభ్యర్థి ఎవరనేది తేల్చితే.. తననే అభ్యర్థిగా ప్రకటిస్తారనే ఆశాభావంతో నామినేషన్ దాఖలు చేసిన వారు ఎక్కడ అసమ్మతి జట్టుకడతారోననే భయం ఈ రెండు పార్టీలనూ వెంటాడుతోంది. మంగళవారం నాటితో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియనున్నా ఇంకా వార్డుల్లో తమ అభ్యర్థులను ఖరారు చేయడంలో ఈ రెండు పార్టీలు సందిగ్ధంలోనే ఉన్నాయి. నగర పంచా యతీ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. పలానా వార్డు కౌన్సిలర్ తమ చైర్పర్సన్ అభ్యర్థి అని తేల్చడంలోనూ ఈ రెండు పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ, సీపీఎం జట్టుకట్టి ఈ సమస్యలన్నింటినీ అధిగమించి...ప్రచారంలో అగ్రపథంలో ఉన్నాయి.