మళ్లీ మంచినీటి కోత
ముంబై : నగర ప్రజలకు మళ్లీ నీటి సరఫరాలో కోత విధించనున్నారు. నగరానికి మంచినీరు సరఫరా చేసే ముఖ్య సరస్సు పైపులైన్ పగిలిపోవడంతో 25శాతం మేరకు కోతలు విధించినట్లు ముంబై కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ముంబై(ఎంసీజీఎం) సోమవారం ప్రకటించింది.
ఠాణే జిల్లా పరిధిలోని వర్తక్నగర్ వద్ద నగరానికి మంచినీరు సరఫరా చేసే తాన్సా నది పైపులైన్ పగిలిపోయింది. దీని కారణంగా తక్షణమే నగరంలోని పశ్చిమ, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో నీటి కోతలు విధించామని మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రమేశ్ బాంబ్లే పేర్కొన్నారు. పైపులైన్ మరమ్మతులు ప్రారంభమాయ్యయని, మంగళవారం సాయంత్రానికి పనులు పూర్తి అవుతాయని పేర్కొన్నారు. పనులు పూర్తికాగానే మంచినీటి సరఫరాను పునరుద్ధరిస్తామని చెప్పారు. గతనెల నగరంలో విధించిన నీటి కోతలను ఈ నెల 13వ తేదీన ఎంసీజీఎం ఎత్తివేసిందని అన్నారు. జూన్లో వర్షపాతం తక్కువ నమోదు కావడంతో జూలై 3వ తేదీ నుండి పౌరపాలనాయంత్రాంగం 20శాతం నీటి కోతలు విధించిందని అన్నారు.
ఇటీవల వర్షాలు కురిసిన కారణంగా 10శాతం కోతలు తగ్గించినట్లు తెలిపారు. ప్రస్తుతం పైపులైన్ పగిలిపోవడంతో కోతలు తిరిగి విధించాల్సి వచ్చిందని అన్నారు.