lock to hospital
-
వైద్యుల మొద్దు నిద్రకు నిండుప్రాణం బలి
► ఆస్పత్రికి తాళం వేసుకుని గాఢ నిద్రలో వైద్య సిబ్బంది ► గుండెపోటుతో వచ్చిన వ్యక్తికి సకాలంలో చికిత్స లేక మృతి ► పొదటూరుపేటలో సంఘటన పళ్లిపట్టు: వైద్యుల మొద్దు నిద్రకు ఓ నిండు ప్రాణం బలైన ఘటన పొదటూరుపేటలో చోటుచేసుకుంది. పళ్లిపట్టు సమీపంలోని పొదటూరుపేట కుడియానవర్ వీధికి చెందిన జ్యోతీశ్వరన్ (69) రిటైర్డ్ బీడీవో కార్యాలయ సిబ్బంది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రి ప్రధాన గేటు మూసివేసి సిబ్బంది లోపల నిద్రపోయారు. బాధితులు కేకలు వేసినా స్పందించలేదు. అనంతరం 25 నిమిషాల తరువాత మేల్కొన్న సిబ్బంది గుండెపోటుకు గురైన వ్యక్తికి చికిత్స ప్రారంభించిన కొద్ది సేపటికే ప్రాణా లు విడిచాడు. సిబ్బంది నిర్లక్ష్యం కాదు: ప్రభుత్వాసుపత్రి చీఫ్ డాక్టర్ చివరి నిమిషంలో రావడంతోనే ప్రాణాలు కాపాడలేక పోయాం. గుండెపోటు వచ్చిన వెంటనే ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లి అక్కడ కాదని చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. రాత్రి వేళల్లో తాగుబోతులు ఆస్పత్రిలోకి ప్రవేశించి గొడవలు చేస్తుండడంతో ఆస్పత్రి తలుపులు మూసి ఉంచుతాం. రోగులు వచ్చిన వెంటనే తెరిచి లోపలకి అనుమతించి చికిత్స చేస్తాం. అదే విధంగా గుండెపోటుతో వచ్చిన వ్యక్తిని అత్యవసర విభాగంలో చేర్పించి చికిత్స ప్రారంభించగానే మృతి చెందారు. ఇందులో మా నిర్లక్ష్యం లేదు. -
వైద్యులులేని ఆస్పత్రి మాకొద్దు
ఆత్మకూర్ : వైద్యులు, వైద్య సిబ్బందిలేని ఈ ఆస్పత్రి ఉన్నా ఒక్కటే.. లేకున్నా ఒక్కటే అని గ్రామస్తులు ఆస్పత్రికి తాళం వేశారు. మండల పరిధిలోని తిప్డంపల్లిలోని పీహెచ్సీలో ఏడాది నుంచి వైద్యులు లేకపోవడంతో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న నర్సులే వైద్యం అందిస్తున్నారు. ఆస్పత్రిలో సోమవారం రాత్రి ఎవరూ లేకుండా పోయారు. గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తి అతిసార బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో ఎవరూ లేకపోవడంతో ఆత్మకూర్‌కు తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఈ సంఘటనతో ఆగ్రహించిన గ్రామస్తులు, సర్పంచ్ విజయమ్మ, ఎంపీటీసీ పురం సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆస్పత్రికి తాళం వేసి క్లస్టర్ వైద్యాధికారి శ్రీనివాసులుకు సమాచారం అందించారు. మంగళవారం ఉదయం స్థానిక పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ అత్యవసరంగా నిర్వహించి వైద్య అధికారుల తీరుపై మండిపడ్డారు. విషయం తెలుసుకున్న క్లస్టర్ వైద్యాధికారి శ్రీనివాసులు, హెల్త్ ఎడుకేటర్ శ్రీరామ్‌సుధాకర్ గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు. నర్సు అనారోగ్యానికి గురై వెళ్లిపోయిందన్నారు. వైద్యులతోపాటు సిబ్బందిని నియమిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శాంతమ్మ, వార్డు సభ్యులు బాల్‌రాజ్, మాకం క్రిష్ణ, శంకర్, పాండురంగం, గ్రామస్తులు పాల్గొన్నారు.