ఒక్క ఎస్ఎంఎస్సే ఇంటికి శ్రీరామ రక్ష
సంగారెడ్డి క్రైం: దొంగతనాలను అరికట్టేందుకు జిల్లాలోనే మొట్ట మొదటి సారిగా సంగారెడ్డి రూరల్ పోలీసులు ఎస్ఎంఎస్ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లే ముందు (మొబైల్ నంబర్ 70323 04400) ఒక్క ఎస్ఎంఎస్ కొడితే చాలు.. ఆ ఇంటిపై పోలీసుల నిఘా నిరంతరం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న గురువారం సంగారెడ్డి రూరల్ పోలీస్స్టేషన్లో ప్రారంభించారు.
‘ఎస్ఎంఎస్ చేయండి రక్షణ పొందండి‘ అనే పోస్టర్ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంగారెడ్డి రూరల్ సీఐ శ్యామల వెంకటేష్ మాట్లాడారు. పోలీస్స్టేషన్ పరిధిలో మూడు బీట్లలో పోలీసులు గస్తీ తిరుగుతారన్నారు. ఊర్లకు వెళ్లే ముందు ప్రజలు తమ ఇంటి నంబర్, చిరునామాను 70323 04400కు ఎస్ఎంఎస్ ఇవ్వాలని సూచించారు.
అలాగే ఇళ్లలో ఎటువంటి విలువైన బంగారు ఆభరణాలు, వస్తువులుగానీ పెట్టి వెళ్లవద్దని చెప్పారు. కష్టాల్లో ఉన్న వ్యక్తుల ఇళ్లలోకి వచ్చి శాంతి, మంత్రాలు చేస్తామని చెప్పి మోసం చేస్తుంటారని, అలాంటి వారని నమ్మరాదని సూచించారు. సమావేశంలో ఎస్ఐ బాలస్వామి పాల్గొన్నారు. అనంతరం పోతిరెడ్డిపల్లిలోని ఓ ఇంటి ముందు సీఐ వెంకటేష్ పోస్టర్ను అతికించారు.