ఆర్మీ వైద్యుడి కారు దొంగతనం.. ఢిల్లీలో అలర్ట్
న్యూఢిల్లీ: ఎన్నడూ లేనంతగా ఈసారి దేశ రాజధానిలో టెన్షన్ టెన్షన్ గా మారింది. గణతంత్ర దినోత్సవం దగ్గరపడుతున్నా కొద్ది చోటుచేసుకుంటున్న సంఘటనలు నిఘావర్గాల, పోలీసుల గుండెల్లో గుబులుపుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ పోలీసులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇప్పటికే పలువురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేయగా.. తాజాగా ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని లోధి గార్డెన్ లో పార్క్ చేసిన ఓ ఆర్మీ ఆస్పత్రి వైద్యుడికి చెందిన తెల్లటి సాంత్రో కారు(హెచ్ఆర్51టీ6646)ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు.
కారుపై ఆర్ఆర్ ఆస్పత్రి స్టిక్కర్ ఉంది. తన కుటుంబంతో కలిసి కాలక్షేపం కోసం ఆ వైద్యుడు పార్క్ కు రాగా కొద్ది సేపటికి ఆయన కారు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. వెంటనే వాట్సాప్ ద్వారా పోలీసు బృందాలకు కారు ఫొటోను పంపించి వెతికే పని ప్రారంభించారు. ఉగ్రవాదులే ఆ కారును ఎత్తుకెళ్లి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా ఉగ్రవాదుల దాడుల ఎక్కువవడం, రిపబ్లిక్ డే దగ్గరపడటంతో ఢిల్లీ పోలీసులు కంటిమీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు.