'పూరి డిస్ట్రిబ్యూటర్ల డైరెక్టర్ అన్నారే..'
హైదరాబాద్: 'లోఫర్ సినిమా విడుదలకు ముందే అభిషేక్, సుధీర్ లు నన్ను కలిశారు. వాళ్ల బ్యానర్ లో నేను ఐదు సినిమాల చేసేలా ఒప్పందం చేసుకుందామన్నారు. ప్రత్యేకంగా తనకో సినిమా చేసిపెట్టాలని ముత్యాల రామ్ దాస్ అడిగారు. ఆ తర్వాతగానీ వాళ్ల ఉద్దేశం ఏంటో నాకు తెలిసిరాలేదు. నాతో సినిమా ఒప్పందాల పేరుతో వాళ్లకున్న అప్పుల్ని నాపై రుద్దే ప్రయత్నం చేశారు. వాళ్ల నష్టాలకు నన్ను బాధ్యుణ్ని చేయాలని చూశారు.
లోఫర్ సినిమా ప్రమోషన్ కు ముందు జరిగిన ప్రెస్ మీట్ లో ఆ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుతూ పూరి డిస్ట్రిబ్యూటర్ల డైరెక్టర్ అని, మమ్మల్ని చూసుకుంటారని ఏదేదో మాట్లాడారు. కేవలం పూరి జగన్నాథ్ వల్లే లోఫర్ నైజాం హక్కులను రూ.7.5 కోట్లకు కొన్నామని సుధీర్ చెప్పారు. కానీ వాస్తవం ఏంటంటే ఆ సినిమా నైజాం హక్కులు రూ.3.4 కోట్లకే అమ్మినట్లు నిర్మాత సి. కల్యాణ్ చెప్పారు. దీన్ని బట్టే ఆ ముగ్గురూ ఎంత డ్రామా ఆడారో అర్థం అవుతుంది. బ్లాక్ మెయిల్ చేసి తప్పుడు లెక్కలు చూపారని తెలుస్తోంది' అంటూ డిస్ట్రిబ్యూటర్లతో నెలకొన్న వివాదంపై సుదీర్ఘవివరణ ఇచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్.
నిర్మాత సి. కల్యాణ్ అంటే తనకెంతో గౌరవమని, అతని కోసం ఎన్ని సినిమాలైనా చేస్తానుగానీ, అలాంటి తప్పుడు మనుషుల కోసం చేయనని సదరు డిస్ట్రిబ్యూటర్లను ఉద్దేశించి పూరి వ్యాఖ్యానించారు. 'నేను కూడా చాలా సినిమాలు నిర్మించాను. విజయవంతమైన ఎన్నో సినిమాలకు సంబంధించి బయ్యర్లు ఇవ్వాల్సినంత ఇవ్వలేదు. ప్లాప్ అయిన సినిమాలకు మాత్రం నేను అన్ని క్లియర్ చేశా' అని నిర్మాణరంగంలో తానెంత నిజాయితీతో వ్యవహరిస్తున్నది చెప్పుకొచ్చారు పూరి. లోఫర్ సినిమాకు తాను దర్శకుడిని మాత్రమేనని, నష్టాలకు తనను బాధ్యుడ్ని చేయటం సరికాదని ఆయన వాపోయారు. లోఫర్ కోసం నా రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకున్నానని, వరుణ్ తేజ్ మంచి భవిష్యత్ ఉన్న హీరోఅని అన్నారు.
అంతకుముందు.. దర్శకుడు పూరి జగన్నాథ్ పై తాము దాడి చేయలేదని తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేశారు. తమపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధులు సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పూరి జగన్నాథ్ పై తాము ఎటువంటి వేధింపులకు పాల్పడలేదని అన్నారు. 'లోఫర్' సినిమా ఫ్లాప్ కావడంతో తమ డబ్బులు తిరిగివ్వాలని నిర్మాత చిల్లర కల్యాణ్ ను అడిగామని తెలిపారు. పూరి జగన్నాథ్ ఇంటికి వెళ్లలేదు, ఆయనతో మాట్లాడలేదని స్పష్టం చేశారు. ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు తనపై దాడిచేశారంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పూరి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవమారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.