నాన్నా..ఇక దొంగ రాడులే..
శ్రీకాళహస్తి గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై హత్యాయత్నం
భద్రత లేదని బాలికను ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు
చదువుకుంటానని వేడుకున్న చిన్నారి
‘‘నాన్నా.. నేను ఇక్కడే ఉంటా. దొంగ నన్ను చంపడానికి ఇక రాడులే. నేను చచ్చిపోయానని వదిలిపెట్టి వెళ్లాడు. చెల్లిని జాగ్రత్తగా చూసుకో’’ ‘‘సార్.. నాకు చదువుకోవాలని ఉంది. ఇంటికి వెళితే బడికి శాశ్వతంగా పంపరు. దయచేసి నన్ను పంపించకండి’’
...అంటూ లోకేశ్వరి అనే చిన్నారి ఆదివారం ఉదయం పాఠశాల ఉపాధ్యాయులను, తన తండ్రిని వేడుకుంది. అయితే తల్లిదండ్రులు ఆ బాలిక ప్రాణాలకు ప్రమాదమని భావించి ఇంటికి తీసుకెళ్లిపోయారు. పేదల పిల్లలు చదివే గురుకుల పాఠశాలలో రక్షణ లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. శ్రీకాళహస్తిలో ఆదివారం చోటుచేసుకున్న సంఘటనే ఇందుకు నిదర్శనం.
శ్రీకాళహస్తి: స్థానిక గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై ఆదివారం హత్యాయత్నం ఘటన తల్లిదండ్రులను కలవరపెట్టింది. తెలుగుగంగ కాలనీలో ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాలలోకి ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ప్రహరీగోడ దూకి లోపలికి చొరబడ్డాడు. ఆరో తరగతి చదువుతున్న కేవీబీపురం మండలం కోవనూరుకు చెందిన లోకేశ్వరి(11) వద్దకు చేరుకుని అమాంతం గొంతునులిమాడు. ఆ చిన్నారి సృహ కోల్పోరుుంది. దీన్ని గమనించిన విద్యార్థినులు కేకలు వేయడంతో ఆ వ్యక్తి పారిపోయాడు. గాయపడిన బాలికను ప్రిన్సిపాల్ ద్వారకానాథ్‌రెడ్డి ఆస్పత్రికి తరలించారు. రెండు గంటల తర్వాత కోలుకున్న బాలికను పాఠశాలకు తీసుకువచ్చారు.
ఇక్కడ భద్రత లేదు
లోకేశ్వరిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఇక్కడ తమ పిల్లలకు భద్రత లేదని ఆందోళన దిగారు. తమ బిడ్డలను ఇంటికి పంపేయాలని డిమాండ్ చేశారు. వుున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి, పాల సొసైటీ చైర్మన్ రావిళ్ల వుునిరాజానాయుుడు, టూటౌన్ సీఐ వేణుగోపాల్, తహశీల్దార్ చంద్రమోహన్, ఎంఈవో బాలయ్యు పాఠశాలకు వెళ్లి బాలికను విచారించారు. 24 గంటల్లో నిందితుడిని పట్టుకుంటావుని సీఐ వేణుగోపాల్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అయితే లోకేశ్వరి తల్లిదండ్రులు మాత్రం ఆ చిన్నారిని తమ ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఆ సందర్భంగాలో ఆ బాలిక తాను చదువుకుంటానని తండ్రిని, ఉపాధ్యాయులను వేడుకుంది. తాను చచ్చిపోయాయని భావించి దొంగ ఇక రాడనీ, తనను ఇక్కడే ఉంచాలని కోరింది. కొద్ది రోజులు ఇంటి వద్ద ఉంచి తర్వాత పంపుతానని నచ్చజెప్పాడు. ఆ విద్యార్థిని మాత్రం చంపబోయినందుకు భయపడలేదు కానీ.. చదువుకోలేకపోతానేమోనని ఏడ్చుకుంటూ నాన్న వెంట వెళ్లింది.