‘దేశం’కు ఇద్దరు అధ్యక్షులు
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యనాయకులు ఒక్కొక్కరుగా జారుకుంటుండగా వారిని కాపాడుకునేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటివరకు జిల్లాలో ఒకే కమిటీ ఉండగా, తాజాగా రెండు కమిటీలుగా విభజించారు. తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు వేర్వేరుగా జిల్లా అధ్యక్షులను గురువారం నియమించారు. మిగతా పదవుల్లో కొనసాగుతున్న వారిని ఆయా జిల్లా కమిటీల కింద కొనసాగుతారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్లో రెండు జిల్లా కమిటీలు ఉండగా, తాజాగా కాంగ్రెస్, బీజేపీల్లోనూ రెండు జిల్లా కమిటీలుగా విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తూర్పునకు అరిగెల నాగేశ్వర్రావు..
తూర్పు ప్రాంతానికి పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు అరిగెల నాగేశ్వర్రావును నియమించారు. ఆసిఫాబాద్ మండలం చిర్రకుంటకు చెందిన ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. గతంలో 2000-2004 వరకు రెండు సార్లు టీడీపీ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించారు. 2002-2005 వరకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర నిర్వహణ కార్యదర్శిగా ఉన్న ఆయనను తూర్పు జిల్లా అధ్యక్షునిగా నియమించారు. రెండు సార్లు ఆసిఫాబాద్ నుంచి ఎంపీపీ, ఒకసారి జెడ్పీటీసీగా వ్యవహరించారు. ఆయన భార్య అరిగెల లక్ష్మి కూడా ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేశారు.
పశ్చిమ ప్రాంతానికి లోలం శ్యాంసుందర్..
పశ్చిమ ప్రాంతానికి లోలం శ్యాంసుందర్‌ను జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. 2001-2006 వరకు జెడ్పీ చైర్మన్గాా పనిచేశారు. లోకేశ్వరం మండలం పిప్పిరి గ్రామానికి చెందిన ఆయన 1995 నుంచి పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతుండగా, పశ్చిమ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. 2010-12 వరకు టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ప్రస్తుతం నిర్మల్‌లో ఉంటున్నారు.