london police
-
బ్రిటన్లో మరో జార్జ్ ఫ్లాయిడ్!
లండన్: యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన అమెరికా నల్లజాతీయుడు జార్జ్ఫ్లాయిడ్ మరణంతో ‘ఐ కాంట్ బ్రీత్’ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ తరహా ఘటన బ్రిటన్లో జరిగింది. బ్రిటన్లోని ఇస్లింగ్టన్ ప్రాంతంలో ఓ నల్లజాతీయుడు కత్తి కలిగి ఉన్నాడనే నెపంతో ఇద్దరు పోలీసు అధికారులు నట్టనడి వీధిలో, ప్రజలంతా చూస్తుండగానే అతని చేతులకు బేడీలు వేసి, గొంతుపై కాలువేసి ఊపిరిసలపకుండా చేశారు. ఆ వ్యక్తి తన మెడపై కాళ్ళు తీయమని పదే పదే వేడుకున్నాడు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో గుమిగూడిన జనం దీన్ని నిరసిస్తూ ఆ నల్లజాతీయుడిని రక్షించేందుకు పూనుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందుకు కారణమైన ఒక స్కాట్లాండ్ యార్డ్ పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు. మరో పోలీసు అధికారిని విధుల నుంచి తప్పించారు. జనం అడ్డుకోకపోతే ఇతడిని జార్జ్ ఫ్లాయిడ్ని చంపినట్టే చంపేసేవారని ప్రత్యక్ష సాక్షులు మీడియాతో చెప్పారు. -
పార్లమెంట్ భవనంలో రేప్
లండన్: బ్రిటన్ పార్లమెంట్ భవనంలో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే అనుమానంతో 23 ఏళ్ల వ్యక్తిని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 14న పార్లమెంట్ భవనంలో మహిళపై నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై అత్యాచార వ్యతిరేక చట్టాల కింద కేసు నమోదు చేశారు. కోర్టు అతడిని బెయిల్ పై విడుదల చేసింది. తదుపరి విచారణ 2017 జనవరిలో జరుగుతుంది. అరెస్ట్ చేసిన వ్యక్తి ఎంపీ కాదని పోలీసులు స్పష్టం చేశారు. నిందితుడు కన్జర్వేటివ్ ఎంపీ తరపున పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అతడి కార్యాలయంలో పోలీసులు సోదాలు చేశారు. పార్లమెంట్ భవనంలో మహిళ లైంగిక వేధింపులకు గురైనట్టు తమకు దృష్టికి వెంటనే అప్రమత్తమయ్యామని, కేసు విచారణలో పోలీసులకు సహరిస్తున్నామని హౌస్ ఆఫ్ కామన్స్ అధికార ప్రతినిధి తెలిపారు. దర్యాప్తు జరుగుతున్నందున వివరాలు వెల్లడించలేమని చెప్పారు. దీనిపై స్పందించేందుకు కన్జర్వేటివ్ పార్టీ నిరాకరించింది. -
ఒంటరి మహిళపై దాడి చేసి...
లండన్: మహిళపై కిరాతంగా దాడి చేసిన దొంగను పట్టుకునేందుకు లండన్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. దొంగను ఎవరైనా గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 20న నార్విచ్ రోడ్ లోని ఫారెస్ట్ గేట్ వద్ద జరిగిన ఈ దారి దోపిడీ స్థానికంగా సంచలనం రేపింది. నైట్ బస్సు దిగి ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న మహిళ(31)ను ఓ దుండగుడు ఆపాడు. ఏం చేస్తున్నావంటూ ఆమెను ప్రశ్నించాడు. పోలీసులకు సమాచారం అందించేందుకు ఆమె ప్రయత్నించగా తన చేతిలోని బాటిల్ తో దాడికి దిగాడు. ఆమె చేతిలోని సెల్ ఫోన్ లాక్కుని తల, చేతులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. బాధితురాలు కిందపడిపోవడంతో ఆమెను అక్కడే వదిలేసి సెల్ ఫోన్ తో పారిపోయాడు. కొంతసేపటికి తేరుకున్న బాధితురాలు సమీపంలోని ఇంటికి వెళ్లి వారి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. దుండగుడు నలుపు రంగులో ఉన్నాడని, బ్లాక్ జాకెట్, ముదరు రంగు ప్యాంట్ ధరించివున్నాడని బాధితురాలు తెలిపింది. అతడి చేతిలో రెడ్ వైన్ బాటిల్ ఉందని వెల్లడించింది. నిందితుడిని గుర్తిస్తే తమకు తెలపాలని స్థానికులను పోలీసులు కోరారు.