కావలిలో ఉన్మాది కలకలం
► నలుగురిపై మారణాయుధాలతో ఆగంతకుడి దాడి
► మహిళ మృతి
► వృద్ధురాలి పాటు ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమం
► బాధితులంతా ఒకే కుటుంబ సభ్యులు
కావలి అర్బన్ : ప్రశాంతతకు మారుపేరైన కావలి పట్టణం శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై ఓ మానవ మృ గం అత్యంత పాశవికంగా మారణాయుధాలతో దాడి చేయడం తీవ్రకలకలం సృష్టించింది. ఈ దాడిలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, వవృద్ధురాలితో పాటు ఇద్దరు చిన్నారులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులు, స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు పట్టణంలోని పాతూరు రాజీవ్‌నగర్ అరటి తోటల ప్రాంతానికి చెందిన సిమిలి వెంకటేశ్వర్లురెడ్డి కుటుంబపై గుర్తుతెలియని వ్యక్తి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దాడికి పాల్పడ్డాడు. వెంకటేశ్వర్లురెడ్డి, ఆయన తండ్రి నాగిరెడ్డి పట్టణంలోని వీడియో మిక్సింగ్ సెంటర్, ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణాల్లో పని చేస్తుండగా ఇంట్లో మహిళలు, చిన్నారులు మాత్రమే ఉన్నారు. ఇదే అదనుగా ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకుడు తొలుత వెంకటేశ్వర్లురెడ్డి తల్లి సుశీలమ్మ కంట్లో కారం చల్లి మారణాయుధాలతో దాడి చేశాడు.
సుశీలమ్మ పెద్దగా కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న కోడలు కవిత (35), వెంకటేశ్వర్లురెడ్డి తమ్ముడి పిల్లలు దీక్షిత, వశిష్ట బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. వీరిపై కూడా మారణాయుధాలతో పాశవికంగా దాడి చేయడంతో కవిత అక్కడికక్కడే మృతి చెందింది. నలుగురు మృతి చెందారని భావించిన ఆగంతకుడు తాపీగా అక్కడి నుంచి పరారయ్యాడు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఇంటికి చేరుకున్న వెంకటేశ్వర్లు తండ్రి నాగిరెడ్డి జరిగిన ఘోరాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన ఊపిరితో ఉన్న సుశీలమ్మను, చిన్నారులను మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో నెల్లూరుకు తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
దాడి జరిగింది ఇలా...
రాజీవ్‌నగర్ అరటితోట ప్రాంతంలో చివరగా ఉండే వెంకటేశ్వర్లురెడ్డి ఇంటికి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని వ్యక్తి వచ్చాడు. ఇంటి బయటే ఉన్న సుశీలమ్మను ఆధార్‌కార్డు కావాలంటూ మాటల్లోకి దించాడు. ఆధార్‌కార్డు ఎందుకు అంటూ సుశీలమ్మ ప్రశ్నిస్తుండటంతో కంట్లో కారం చల్లి వెంట తెచ్చుకున్న ఆయుధాలతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. సుశీలమ్మ పెద్దగా కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న కోడలు కవిత, వెంకటేశ్వర్లురెడ్డి తమ్ముడి పిల్లలు బయటకు పరుగెత్తుకుంటూ వచ్చారు. శివరాత్రి వేడుకలకు వచ్చి...దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారులు దీక్షిత, వశిష్ట వెంకటేశ్వర్లు రెడ్డి సోదరుడు జనార్దన్ రెడ్డి పిల్లలు. హైదరాబాద్‌లో టెలికాం డిపార్టమెంట్లో పనిచేసే జనార్దన్ రెడ్డి శివరాత్రి వేడుకల కోసమని పిల్లలిద్దరిని రెండు రోజుల కిత్రమే కావలికి తీసుకువచ్చి నానమ్మ వద్ద వదిలి వెళ్లాడు. అభంశుభం తెలియని ఈ పిల్లలిద్దరూ కూడా ఆగంతకుడి చేతిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
అన్నీ అనుమానాలే...
రాజీవ్‌నగర్ అరటి తోటల ప్రాంతంలో జరిగిన హత్యాకాండపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యలు చేసిన వ్యక్తి ముందుగా ప్రణాళిక వేసుకునే కారం, కత్తులు వెంట తెచ్చుకున్నట్లు తెలుస్తుంది. ముందుగా ఆ ప్రాంతంలో రెక్కీ వేసుకుని జనసంచారం తక్కువగా ఉన్న సమయంలో హత్యకు పాల్పడినట్లు సంఘటనా స్థలంలోని పరిస్థితుల ద్వారా అర్థమవుతుంది. జనవాసాలకు కొంచెం దూరంగా ఉండే ప్రాంతం కావడంతో హత్యల విషయం రెండు గంటల ఆలస్యంగా వెలుగు చూసింది. పాత కక్షలు లేదా అక్రమ సంబంధానికి సంబంధించిన వివాదమే హత్యలు కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు.
ఏఎస్పీ పరిశీలన :
ఏఎస్పీ రెడ్డి గంగాధర్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌ను సంఘటనా స్థలానికి పిలిపించారు. పోలీసు కుక్కలు పట్టణంలోని పలు వీధులు తిరిగి డీఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న ట్రంకురోడ్డు వద్ద ఆగాయి. క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు.