రూ.2వేల నోటుపై ఆ వీడియోలు నమ్మొద్దు
న్యూఢిల్లీ: రూ.2000 నోటుపై ఇంటర్ నెట్లో హల్ చల్ చేస్తున్న వీడియోలు నిజం కావని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ ఓ ప్రకటనలో తెలిపారు. రూ.2వేల నోటును నీటిలో తడుపుతూ ఎలాంటి రంగూ కోల్పోడం లేదని చూపుతున్న వీడియోల్లో నిజం లేదని అన్నారు. అసలైన రూ.2వేల నోటు రంగు కోల్పోతుందని చెప్పారు.
నోటును తడిపినా, రుద్దినా దానిపై ఉన్న రంగు పోతుందని పేర్కొన్నారు. నోట్ల తయారీలో ఉపయోగించిన రంగే ఇందుకు కారణమని తెలిపారు. అలా రంగు కోల్పోని నోట్లే నకిలీవని చెప్పారు. మరి నెట్ లో చూపుతున్న వీడియోల మాటేమిటని మీడియా ప్రశ్నించగా.. ఇంటర్ నెట్లో కనిపించే ప్రతి ఒక్కటి నిజం కాదని వాటిని నమ్మొద్దని సమాధానం ఇచ్చారు.
యూట్యూబ్ లోని మరికొన్ని వీడియోల్లో రూ.2వేలు నోటును నీటిలో తడిపినప్పుడు రంగు కోల్పోయాయని చెప్పారు. నోట్లను సొంతగా పరీక్షించుకున్న వారు అవి చెల్లవని ఆందోళన చెందొద్దని తెలిపారు. రంగు కోల్పోయిన నోట్లు కూడా చెల్లుతాయని చెప్పారు.