పీర్ల పండుగకు వెళ్తే కొల్లగొట్టారు
అనంతపురం క్రైం: స్వగ్రామంలో జరిగిన పీర్ల పండుగకు వెళ్లిన కొత్తకోట సర్పంచ్ నాగమణి ఇంట్లో దొంగలు పడి ఇంటిని కొల్లగొట్టారు. బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు... కొత్తకోట సర్పంచ్ నాగమణి, భర్త కేశవ్‌తో కలిసి స్థానిక ఆదిమూర్తినగర్‌లో లిటిల్‌ఫ్లవర్ స్కూల్ సమీపంలో నివాసముంటున్నారు.
కేశవ్ నగరంలో కృష్ణ జీన్స్ నిర్వహిస్తున్నారు. పీర్ల పండుగ కావడంతో ఈనెల 15న సొంతూరు కొత్తకోటకు కుటుంబ సమేతంగా వెళ్లారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు ఇంటికొచ్చారు. ఇంటి తాళం తీయడానికి ప్రయత్నిస్తే గడియ పెకిలించి ఉంది. అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఇంట్లో రెండు బీరువాలు ఉన్నాయి.
దొంగలు ఒక బీరువా గడియను మెడ్డాయించి తలుపులు తెరిచారు. అందులో ఉన్న 8.20 తులాల బంగారం, రూ.10.50 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. మరో బీరువాలో డబ్బులున్నా దానిజోలికి వెళ్లలేదని బాధితులు వివరించారు. దొంగతనం ఎప్పుడు జరిగిందనేది అంతుచిక్కవడం లేదు. ఈ ప్రాంతం చాలా ప్రశాతంగా ఉంటుంది.
గడియ పెకిలించే క్రమంలో చిన్నశబ్దం వచ్చినా చుట్టుపక్కల వారికి తెలిసే అవకాశం ఉంది. పక్కా ప్లాన్‌తో గడియ మెడ్డాయించి దుండగులు లోపలికి ప్రవేశించినట్లు అర్థమవుతోంది. బాధితుల ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. క్లూస్‌టీం వేలిముద్రలు సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలిసి పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త సోమశేఖర్‌రెడ్డి వచ్చి ఇంటిని పరిశీలించి బాధితులను పరామర్శించారు.