ఎన్ఆర్ఐ డిపాజిట్ల వెల్లువ
న్యూఢిల్లీ: దేశానికి ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) డిపాజిట్లు భారీగా పెరుగుతున్నాయని ప్రముఖ ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ పేర్కొన్నారు. గడచిన ఆరు నెలల కాలంలో దేశానికి 65 బిలియన్ డాలర్ల ఎన్ఆర్ఐ డిపాజిట్లు వచ్చినట్లు పాల్ తెలిపారు. తద్వారా దేశాభివృద్ధిలో వారు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ సోమవారం రాత్రి ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ తన గౌరవార్థం నిర్వహించిన ఒక విందు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశాభివృద్ధిలో ఎన్ఆర్ఐల తోడ్పాటును ప్రజలు మరవడం తగదని అన్నారు. భారత వోటర్లు ఎటువంటి ప్రలోభాలకూ లోనుకాకుండా తమ వోటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల నేపథ్యంలో ఆయన పిలుపునిచ్చారు. దేశం అన్ని రంగాల్లో విజయం సాధించడానికి రాజకీయ పార్టీలు విద్య, పేదరిక నిర్మూలన వంటి అంశాలకు ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు.