అర్ధరాత్రి దారిదోపిడీ
నిజాంసాగర్: నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ - పిట్లం ప్రధాన రహదారిపై గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.15 గంటలకు దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. చెట్లను నరికి రోడ్డుపై వేశారు. ఆ సమయంలో వచ్చిన వాహనాలను అపుతూ దోపిడీ చేశారు. నాలుగు లారీలు, రెండు స్కార్పియోలు, ఒక తుఫాన్, ఒక బైక్పై ప్రయాణిస్తున్న వారిని దోచుకున్నారు.
మొత్తం రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు దోపీడీ జరిగింది. ఈ సందర్భంగా ఎదిరించిన మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన లారీల డ్రైవర్లు గణేశ్, కరణ్ పవార్లపై దొంగలు దాడి చేసి కొట్టారు. దొంగల ముఠాలో పది నుంచి పదిహేను మంది వరకు ఉన్నారని, వారి వద్ద కత్తులు, వేట కొడవళ్లు, గొడ్డళ్లు ఉన్నాయని బాధితులు తెలిపారు. హిందీ, తెలుగు భాషల్లో మాట్లాడిన దొంగలు టీషర్టులు, ప్యాంట్లు ధరించి ఉన్నారన్నారు. దోపిడీ దొంగల సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై అంతిరెడ్డి పోలీసు బలగాలతో ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే దొంగలు అటవీ ప్రాంతంలోకి పారిపోయారు.
మాగి, ఒడ్డేపల్లి శివారులోని అటవీ ప్రాంతాన్ని పోలీసులు అర్ధరాత్రి దొంగల కోసం గాళించారు. పోలీసులు సకాలంలో అక్కడికి చేరుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డామని పలువురు వాహనదారులు, మహిళా ప్రయాణికులు పేర్కొన్నారు. దోపిడీ దొంగలను మహారాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. అటవీ ప్రాంతంలోని చెట్లను యంత్రం ద్వారా కోసినట్లుగా అనవాళ్లు ఉన్నాయని ఎస్సై తెలిపారు.
కాగా ఈ నెల 4న అర్ధరాత్రి దొంగలు అదేప్రాంతంలో చెట్లకొమ్మలను అడ్డంగా వేసిదారి దోపిడీకి ప్రయత్నించినట్లు స్థానికులు చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు కూడలి మార్గంగా ఉన్న రోడ్డుపై దొంగలు దారిదోపిడీలకు తెగబడుతున్నారన్నారు. ఎక్కువ జనసంచారం లేని అటవీ ప్రాంతం కావడంతో దొంగలకు అనుకూలంగా ఉందని అంటున్నారు.