13 కిలోలు తగ్గిన హన్సిక
హన్సిక బిజీ బిజీగా ఉన్నారు. ఆమె చేతిలో దాదాపు తొమ్మిది సినిమాలున్నాయి. వీటితో పాటు కొత్త సినిమాలకు డేట్స్ కేటాయించడానికి డైరీ చెక్ చేసుకుంటున్నారామె. ఇన్ని సినిమాలు ఉన్నందువల్లో ఏమో ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని స్పష్టం చేశారు హన్సిక. కెరీర్‌ని అంత సీరియస్‌గా తీసుకున్నారు కాబట్టే, ట్రెండ్‌కి తగ్గట్టుగా స్లిమ్‌గా ఉండాలనుకున్నారు. అందుకే సన్నబడ్డారు. అది కూడా నాలుగైదు కిలోలు కాదు.. ఏకంగా 13 కిలోలు తగ్గారామె. తన పట్టుదల, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని హన్సిక చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గురించి ఆమె మాట్లాడుతూ -‘‘తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘పాండవులు పాండవులు తుమ్మెదా’లో విష్ణు సరసన కథానాయికగా నటిస్తున్నాను.
ఇంకా తమిళ, తెలుగు భాషల్లో ‘బిర్యానీ’, తమిళంలో ‘అరణ్మణై’, ‘మాన్ కరాటే’ తదితర చిత్రాల్లో నటిస్తున్నాను. వీటిన్నిటిలోనూ నావి మంచి పాత్రలే కావడం ఆనందంగా ఉంది. నటిగా నన్ను నేను మరింతగా నిరూపించుకోవడానికి ఆస్కారం ఉన్న పాత్రలివి’’ అని చెప్పారు. ఇవి కాకుండా ‘ఇష్క్’ తమిళ రీమేక్‌లో, శింబు సరసన ఓ తమిళ చిత్రం, నాగచైతన్య సరసన ఓ సినిమా, రవితేజతో ఓ సినిమాలో ఆమె నటించే అవకాశం ఉంది. ఇంకొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయని హన్సిక తెలిపారు. తెలుగు చిత్రాల ద్వారా కథానాయిక అయ్యి, ఇక్కడ సంపాదించుకున్న గుర్తింపు ద్వారా తమిళ పరిశ్రమకు పరిచయం కావడం, అక్కడా బిజీ అవ్వడంపట్ల హన్సిక ఆనందం వ్యక్తం చేశారు.