ప్రాజెక్టులకు వరద నష్టం రూ.112 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల వరదల కారణంగా జరిగిన నష్టంపై నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టులకు సంబంధించి మొత్తంగా రూ.112 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తేల్చింది. వరద నష్టంపై అంచనాలకోసం ఈ నెల 13, 14 తేదీల్లో కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖ వరద నష్టం అంచనాలను సిద్ధం చేసింది. మేజర్ ప్రాజెక్టులకు 32 చోట్ల నష్టం జరిగిందని నీటిపారుదల శాఖ తన నివేదికలో పేర్కొంది. వీటి పునరుద్ధరణకు రూ.54.73 కోట్లు అవసరం ఉంటుందని లెక్కకట్టింది.
ఇందులో రూ.50 కోట్లు కేవలం మిడ్మానేరు ప్రాజెక్టులో తెగిన కట్టకే అవసరమని పేర్కొంది. మీడియం ప్రాజెక్టుల కింద మొత్తంగా 5 చోట్ల నష్టం ఉందని, వాటికి మరో రూ.26 లక్షలు అవసరమని తెలిపింది. ఇక మైనర్ ఇరిగేషన్ కింద మొత్తంగా 671 చెరువుల పరిధిలో నష్టం జరిగిందని, వీటి పునరుద్ధరణకు రూ.57.58 కోట్లు అవసరమని తెలిపింది. మొత్తంగా రూ.112.88 కోట్లు అవసరం ఉంటాయని లెక్కకట్టింది. ఈ మేరకు బుధవారం నష్టం అంచనాలను ప్రభుత్వానికి అందజేసింది.